విజయవాడ : గత ప్రభుత్వం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అవమానం జరిగేలా వ్యవహరిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయన భారీ విగ్రహ ఏర్పాటుతో గౌరవిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేయబోతున్న భారీ విగ్రహ పనులను ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతారని మేం ఊహించలేదు.
ఇంత ఖరీదైన స్థలంలో విగ్రహ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దేశంలోనే ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విగ్రహ తయారీ హర్యానాలో జరుగుతోంది. విగ్రహ ఏర్పాటు కోసం నిర్మాణ వ్యయం పెరిగినా ముందుకే వెళ్తున్నాం. సీఎం జగన్ నిర్ణయం నభూతో.. నభవిష్యత్. ఇచ్చిన మాటమీద నిలబడే నాయకుడు సీఎం జగన్. 2023 ఏప్రిల్ 14 నాటికి విగ్రహం ఏర్పాటు చేసి తీరతాం అని మంత్రి నాగార్జున పేర్కొన్నారు. గత ప్రభుత్వం అంబేద్కర్ ను అగౌరవ పరిచేలా వ్యవహరించింది.
అంబేద్కర్ ఆలోచనలను అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు. దళిత జాతిని అవమాన పరిచిన చరిత్ర చంద్రబాబుది. అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు గురించి మాట్లాడటం కూడా అవమానమే అంటూ పేర్కొన్నారు. టీడీపీ నేతలకు ఉత్తరాంధ్ర ఇప్పుడు గుర్తుకొచ్చిందా?. 14 ఏళ్లలో చంద్రబాబుకు ఉత్తరాంధ్ర గుర్తుకు రాలేదా?. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఎందుకు గుర్తుకు రాలేదు?. మూడు రాజధానుల పై జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాకే చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ పుట్టుకొచ్చిందా?. చంద్రబాబు, టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయ్. రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు యాత్ర చేయిస్తున్నాడు. అమరావతి ప్రాంతంలో రైతుల కోసం కూడా చంద్రబాబు ఆలోచన చేయలేదు అని మంత్రి మేరుగ విమర్శించారు.