సచివాలయంలో హరితోత్సవం పోస్టర్ ను ఆవిష్కరించిన అటవీ, పర్యావరణ
శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19 న
ప్రత్యేక హరితోత్సవం నిర్వహిస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో హరితోత్సవం
పోస్టర్ ను అటవీ శాఖ అధికారులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. గత
తొమ్మిదేళ్లుగా హరితహారంలో భాగంగా అమలు చేస్తున్న ప్రత్యేక
కార్యక్రమాలు, విజయాలను వివరించే రెండు పోస్టర్లును అటవీ శాఖ తయారు
చేసింది. పెద్ద ఎత్తున కోట్లాది మొక్కలు నాటడం, రహదారి వనాలు, పల్లె
ప్రకృతి వనాలు, అర్బన్ పార్కుల ఏర్పాటు, అటవీ పునరుద్దరణలో భాగంగా
అడవుల లోపల చేపట్టిన కార్యక్రమాలను పోస్టర్లలో పొందు పరచారు.
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతీ గ్రామం, పట్టణం, ప్రభుత్వ
కార్యాలయాల్లో హరితహారం విజయాలను ప్రదర్శించేందుకు అటవీ శాఖ
ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జూన్ 19న
హరితోత్సవం సందర్భంగానే తొమ్మిదో విడత హరితహారం ప్రారంభమౌతుందని
మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని మంత్రి
పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు ఎంత ప్రత్యేకమో, రాష్ట్ర ఆవిర్భావం
తర్వాత ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అమలు చేస్తున్న పథకాలు అంతే
విశిష్టతను కలిగి ఉన్నాయని మంత్రి అన్నారు. 33 శాతం పచ్చదనం సాధన
కోసం అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం జాతీయ స్థాయి ప్రశంసలు
అందుకుంటోందని అన్నారు. ఈ పథకానికి దక్కుతున్న ప్రతీ అవార్డు,
గుర్తింపులో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం ఉందని, ప్రపంచ పర్యావరణ
దినోత్సవం సందర్భంగా పచ్చదనం పెంపుకు అందరూ పునరంకితం కావాలని మంత్రి
పిలుపునిచ్చారు.