ఏయూకు జాతీయ స్థాయిలో ఖ్యాతి
సేవలు గుర్తించి ప్రోత్సహించిన ప్రభుత్వం
నేడు రెండోసారి ఉప కులపతిగా బాధ్యతల స్వీకరణ
విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయ ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపచేసిన ఘనత ఆయన సొంతం..విద్యార్థులే తన కుటుంబం అంటూ వారి అభ్యున్నతే తనకు ప్రధానమని విశ్వసించిన నిస్వార్ధ ఆచార్యుడు ఆయన..నాలుగేళ్ళుగా ప్రతీ క్షణం వర్సిటీ ప్రగతికే వెచ్చించిన వ్యక్తిత్వం ఆయనది. విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను ఇనుమడింపచేస్తూ నవ్య ఆలోచనలతో ముందడుగు వేశారు. నూతన ప్రాజెక్టులను చేపట్టారు. విశ్వవిద్యాలయ ప్రగతికి బాటలు వేసిన అసామాన్యుడు ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి. ఈయన కృషి, పట్టుదలను గుర్తించే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి బాధ్యతలను అప్పగించింది. రెండో పర్యాయం ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా శనివారం ఉదయం 10 గంటలకు ఏయూ పరిపాలనా భవనంలో వీసీ కార్యాలయం నుంచి ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు.
నాక్ డబుల్ ఫ్లస్ గ్రేడ్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో నాక్ డబుల్ ఫ్లస్ గ్రేడ్ని సాధించింది. దీనితో పాటు 3. 74 సిజిపివఏతో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఆచార్యుల కొరత ఉన్న సమయంలో కూడా ఏయూ ఇంతటి విశిష్ట ర్యాంకింగ్‌ను సాధించడం జాతీయ స్థాయిలో తొలి మూడు విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఏయూని నిలపడం వెనుక ఆచార్య ప్రసాద రెడ్ది అవిశ్రాంత కృషి ఉంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకే కాకుండా, కేంద్రీయ విశ్వవిద్యాలయాల కంటే మెరుగైన స్కోర్ ఏయూ సాధించడం సర్వసాధరణ విషయం కాదు. ప్రణాళికాబద్ధంగా ఏయూలో జరిగిన అభివృద్దిని స్వయంగా వీక్షించిన నాక్ కమిటీ చైర్మన్‌తో సహా సభ్యులు వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి కార్యదక్షతను కొనియాడారు. నాక్ గుర్తింపు ఏఎయూకు 2030 వరకు వర్తిస్తుందని నాక్ పేర్కొంది.
విపత్కర సమయాల్లో సైతం : కోవిడ్ వంటి విపత్కర సమయాల్లో సైతం సకాలంలో పరీక్షలు పూర్తిచేసి, ఫలితాలను నిర్దేశిత సమయం కంటే ముందుగానే అందించారు. విద్యార్ధులకు ఉపాధి అవకాశాలను పెంచాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్లేస్మెంట్ అధికారులను నియమించి, ఇంజనీరింగ్‌తో సమానంలో ఆర్ట్స్, సైన్స్ కోర్సుల విద్యార్థులకు ప్లేస్మెంట్స్ను కల్పించి నూతన ఒరవడికి నాంది పలికారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ప్లేస్మెంట్ లెటర్స్‌ని అందించి వేలాదిమంది కుంటుంబాలలో సంతోషాలను నింపారు. ఈ సంవత్సరం అత్యధికంగా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని 84.5 లక్షల వేతనంతో ఉద్యోగం సాధించడం వర్సిటీలో మరొక రికార్డుగా నిలుస్తోంది.
ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య పెంపు : పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను మరింత చేరువ చేసే విధంగా వర్పిటీ వీసీగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇంజనీరింగ్ కళాశాలో సీట్లు సంఖ్య రెట్టింపు చేశారు. విద్యార్థులను ఆవిష్కర్తలుగా, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏయూ-నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ని ప్రారంభించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో గతంలో లేని విధంగా సొంతంగా ఒక స్టార్టప్, ఇంక్యుబేషన్ సెంటర్ ఆ హబ్‌ను తీర్చిదిద్దారు. నేడు 150కి పైగా స్టార్టప్ సంస్థలు ఇక్కడ నుంచి సేవలు అందిస్తూ వేలాదిమంది యువతకు ఉపాధిని సైతం అందిస్తున్నాయి. ఫార్మ రంగంలో స్టార్టప్, ఇంక్యుబేషన్ కేంద్రంగా ఎలిమెంట్‌ను తీర్చిదిద్దారు. అంతర్జాతీయ విద్యార్థులను ఏయూకు స్వాగిస్తూ నిర్వహిస్తున్న ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఏయూ సిబ్, అవంతి ఫీడ్స్ సంస్థ సహకారంతో ఏర్పాటైన ఏయూ-అవంతి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మెరైన్ సంబంధిత రంగాల్లో విశిష్ట పరిశోధనలు జరుపుతూ ఈ రంగానికి అవసరమైన నిపుణులను తీర్చిదిద్దే ప్రక్రియలో విజయవంతంగా పనిచేస్తోంది. ఆర్ఐఎన్ఎల్ సహకారంలో హ్యామన్ జెనిటిక్స్ విభాగంలో బయోఆర్బర్ ఇక్యుబేషన్ కేంద్రాన్ని ఏయూ పూర్వ విద్యార్థి రవికిరణ్ స్థాపించిన టికాబ్స్-ఇ జీవశాస్త్ర సంబంధ పరిశోధనలు, ఆవిష్కరణలు చేస్తూ విద్యార్థులు ‘పేటెంట్’లు సాధించే దిశగా పనిచేస్తోంది.