వాషింగ్టన్ : అప్పుల పరిమితి పెంపుపై చిక్కుముడులతో దివాలా అంచున ఉన్న
అమెరికాకు ఊరట లభించింది. జోబైడెన్, రిపబ్లికన్ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది.
రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై అమెరికా శ్వేతసౌధం,
ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి వచ్చారు. ఈ
విషయాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థి ధ్రువీకరించారు. దివాలా
అంచుకు చేరిన అమెరికాకు ఈ ఒప్పందంతో కాస్త ఊరట లభించినట్లైంది. అమెరికా
అధ్యక్షుడు జోబైడెన్, మెకార్థి మధ్య ఫోన్‌కాల్‌లో చర్చలు జరిగాయి. ఈ
సందర్భంగా వారు ఒప్పందానికి వచ్చారు. తాజాగా ఈ డీల్‌ను కాంగ్రెస్‌లోని తమ
పార్టీ సహచరులతో ఆమోదముద్ర వేయించడమే తరువాయి. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల
ఆధిపత్యం ఉండగా సెనెట్‌లో డెమొక్రాట్ల పట్టు ఉంది. ఈ ఒప్పందం జూన్ 5వ
తేదీలోపు కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత బైడెన్ దీనిపై సంతకం
చేస్తే అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఈ ఒప్పందం అమల్లోకి రాకపోతే. జూన్ 5వ తేదీ
తర్వాత నుంచి అమెరికా అప్పులు చెల్లించే పరిస్థితిలో ఉండదని ఇప్పటికే అమెరికా
ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ హెచ్చరికలు జారీ చేశారు.
వారాల తరబడి చర్చల తర్వాత మేము సూత్రప్రాయంగా ఓ ఒప్పందానికి వచ్చాం. మేము ఇంకా
చాలా పనిచేయాల్సి ఉంది. కానీ, ఈ సూత్రప్రాయ ఒప్పందం అమెరికా ప్రజలకు ఎంతో
విలువైంది’’ అని మెకార్థి విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. మరోవైపు
అధ్యక్షుడు జో బైడెన్ వైపు నుంచి దీనిపై ప్రకటన విడుదలైంది. ‘‘ఈ ఒప్పందం నాతో
సహా కాంగ్రెస్‌లోని డెమొక్రాట్ల కీలక ప్రాధాన్యాలు, చట్టపరమైన విజయాలను
సంరక్షిస్తుంది. ఈ ఒప్పందం రాజీపడటానికి ప్రతీక మాత్రమే. అంత మాత్రాన ప్రతి
ఒక్కరికీ వారికి కావాల్సినవి లభిస్తాయని కాదు. అది పాలనాపరమైన బాధ్యత అని ఈ
ప్రకటనలో పేర్కొన్నారు. 2021 నాటికి ప్రభుత్వం తీసుకున్న అప్పు 28.5
ట్రిలియన్ డాలర్లు. దేశ జీడీపీ కంటే ఇది 24 శాతం ఎక్కువ. ఇందులో ఎక్కువ
మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించగా సుమారు 7 ట్రిలియన్
డాలర్లను విదేశాల నుంచి సేకరించింది. జపాన్, చైనాల నుంచి బాండ్లు కొనుగోలు
చేసినవారూ ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి
31.4 ట్రిలియన్ డాలర్లు. ఇదీ దాటి అప్పులు చేయడానికి బైడెన్ ప్రభుత్వం
కాంగ్రెస్ అనుమతి కోరుతోంది. కానీ ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో
ఉన్న రిపబ్లికన్లు అప్పు పరిమితి పెంచేందుకు ససేమిరా అనడంతో టెన్షన్
మొదలైంది. మరింత అప్పు అంటే ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ
లేనట్లేనని, భవిష్యత్ ఖర్చులు తగ్గించుకోవాలని వాదించారు. బైడెన్‌తో
రిపబ్లికన్లు కొన్ని వారాలపాటు చర్చలు జరిపి తాజాగా సూత్రప్రాయంగా ఒప్పందానికి
వచ్చారు. 1917 నుంచి ఇప్పటిదాకా 78 సార్లు అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితిని
సవరించారు. ప్రతిసారీ సాధారణంగా జరిగిపోయే ప్రక్రియే ఇది. కానీ అమెరికాలో
డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య పెరిగిన రాజకీయ వైరం, సైద్ధాంతిక విభేదాల
కారణంగా ఈసారి పీటముడి బిగుసుకుంది.