పార్టీ అనుబంధ విభాగాల సమావేశంలో ఎంపి విజయసాయిరెడ్డి
ప్రతి పార్టీ అనుబంధ విభాగానికి ముగ్గురు ఉపాధ్యక్షులు
పార్టీ పటిష్టతకు మూడు ప్రాంతాలుగా 8 జోన్లుగా విభజన
గుంటూరు : పేద ప్రజల,బలహీనవర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, అన్ని వర్గాల
సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని
వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కోఆర్డినేటర్, పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జీ
విజయసాయిరెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో
బుధవారం నాడు పార్టీ అనుబంధ విభాగాలు డాక్టర్లు, క్రిస్టియన్, మైనారిటీ,
ప్రచార, చేనేత విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులతో
విజయసాయిరెడ్డి వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న అనేక
అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్ష పార్టీలు
చేస్తున్న దుష్ప్రచారాలు తిప్పికొట్టాలిని పిలుపునిచ్చారు.. ప్రభుత్వంపై
తెలుగుదేశం పార్టీ దాని అనుకూల మీడియా, సోషల్ మీడియాలో దురుద్దేశంతో
ప్రభుత్వంపై కృత్రిమంగా ప్రజావ్యతిరేకతను సృష్టించే కుటిల ప్రయత్నాలు
జరుగుతున్నాయని, అలాంటి దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, మన ప్రభుత్వం చేస్తున్న
అభివృద్ధి, సామాన్య ప్రజానీకం మేలు కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను
విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలు
చేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని సాగుతున్న ప్రచారంలో ఇసుమంత కూడా వాస్తవం
లేదన్నారు. జగన్ గారి నిర్ణయాలతో రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి
చెందుతోందని వెల్లడించారు.గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యలో ఉన్న
వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు.
ఏపీలో అమలవుతున్న పధకాలు, కార్యక్రమాలు దేశానికి రోల్ మోడల్ గా నిలిచాయని,పలు
రాష్ట్రాల అధికారుల మన రాష్ట్రానికి వచ్చి అధ్యయనం చేస్తున్నారని చెప్పారు.
పార్టీ కమిటిలను త్వరగా భర్తీ చేసి, మళ్లీ 2024 అధికారమే లక్ష్యంగా
పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్
ఇచ్చేందుకు క్షేత్రస్థాయి నుంచి సిద్ధంగా ఉండాలని చెప్పారు.
పార్టీ పటిష్టతకు మూడు ప్రాంతాలుగా 8 జోన్లుగా విభజన : వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ సౌలభ్యం కొరకు అనుబంధ విభాగాలను మూడు ప్రాంతాలుగా విభజన చేసినట్టు ఆయన
చెప్పారు. రాష్ట్ర పార్టీ విభాగానికి అధ్యక్షుడు ఉంటాడు. అధ్యక్షుడుతో పాటుగా
ఉత్తరాంధ్ర- గోదావరి జిల్లాల నుండి ఒక ఉపాధ్యక్షుడు, కోస్తాంధ్ర జిల్లాల
నుండి ఒక ఉపాధ్యక్షుడు, రాయలసీమ జిల్లాల నుండి ఒక ఉపాధ్యక్షుడుని నియమించడం
జరుగుతుందని చెప్పారు. ఈ ముగ్గురు పార్టీ అనుబంధ విభాగ అధ్యక్షుడు కింద పని
చేస్తారని తెలిపారు. అలాగే మొత్తం రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాలను ఎనిమిది
జోన్లగా విభజన చెయ్యడం జరిగిందని ఇప్పటికి ప్రతి జోన్ నుండి జోనల్ ఇంఛార్జీని
నియమించడం జరిగిందన్నారు. వీటికింద జిల్లా పార్టీ అనుబంధ విభాగ కమిటి పని
చేస్తుందని చెప్పారు. ఎన్నికలు సమిపిస్తున్నందునా మొత్తం భారం అనుబంధ విభాగ
అధ్యక్షుడు మీద పడకుండా ప్రాంతాల వారీగా ఉధ్యక్షులను నియమించడం జరుగుతుందని
తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో డాక్టర్ల విభాగ అధ్యక్షుడు బత్తుల
అశోక్ కుమార్ రెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ విభాగ అధ్యక్షుడు మేడిది జాన్సన్,
ప్రచార విభాగ కమిటీ అధ్యక్షుడు ఆర్.ధనుంజయ రెడ్డి, చేనేత విభాగ అధ్యక్షుడు
గంజి చిరంజీవి నేతృత్వంలో అనుబంధ విభాగాలు సమావేశం జరిగింది.. ఈ సమావేశాలకు
ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.