దేవాలయాల భూములు ఆక్రమణలను అడ్డుకోవడానికి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు
ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
వెలగపూడి : రాష్ట్ర వ్యాప్తంగానున్న దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణకై చట్ట
సవరణ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక
నిర్ణయానికి రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలుపుతూ ఆర్డినెన్సును జారీ చేయడం
జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు
సత్యనారాయణ తెలిపారు. శాసన సభ ఆమోదంతో త్వరలోనే ఈ ఆర్డినెన్స్ చట్టంగా
మారనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో
బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ దేవాదాయ చట్టం
సెక్షన్ 83 లో మార్పులు చేర్పులతో దేవాలయ ఆస్తుల పరిరక్షణ సాద్యమయిందన్నారు.
దేవాలయాల భూములు ఆక్రమణలను అడ్డుకోవడానికి, ఆస్తుల పరిరక్షణకు సీసిఎల్ఏ
అధ్యక్షతన రాష్ట్ర స్థాయి, జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా స్థాయి
కమిటీలను ఏర్పాటు చేయడమైందన్నారు. దేవాదాయ శాఖకు చెందిన భూముల లీజు కాల
పరిమితి పూర్తి అయినప్పటికీ రెన్యూవల్ చేయించుకోక పోవడము , డబ్బు చెల్లించక
పోవడం వంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ చట్ట సవరణ దోహదపడుతుందన్నారు.
ఖాళీగా ఉన్న భూములు, స్థలాలను వేలం నిర్వహిస్తామని , దానిలో గతంలో బకాయిలు
ఉన్నవారు పాల్గొనకూడదని అన్నారు. దేవాదాయ శాఖకు చెందిన ఆస్తుల పరిరక్షణకు
ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీలు దేవాలయ భూములపై ప్రతి నెలా సమీక్షించి
నివేదిక ఇస్తారని, దానిపై రాష్ట్ర స్థాయి కమిటీ చర్యలు తీసుకోవడం
జరుగుతుందన్నారు. భూముల ఆక్రమణలకు సంబందించి ఎటువంటి లొసుగులు లేకుండా
పారదర్శకంగా వేలం వేస్తామన్నారు. దేవాదాయ భూముల్లో అగ్రికల్చర్ , కమర్షియల్
మొత్తం కలిపి సుమారు 4,53,173 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. విలువైన భూముల్లో
తాత్కాలిక కట్టడాలను అనుమతిస్తామన్నారు.
రూ .5లక్షలోపు ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్టీలను ఏర్పాటు చేయమని స్పష్టం
చేసారు. ఆయా దేవాలయాలకు వంశపారంపర్య అర్చకులు, వ్యవస్థాపక కుటుంబ సభ్యులకు
నిర్వహణను అప్పగిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి
ఇచ్చిన హామీ మేరకు అటువంటి దేవాలయాల అర్చకులకు వేతనాలను పెంచామని చెప్పారు.
ప్రముఖ దేవాలయాల్లో ఈవో లకు కొన్ని అధికారాలు ఉంటాయని, అయితే దేవాలయాలపై
సర్వాధికారాలు తమకే ఉంటాయని ట్రస్టీలు భావించకూడదన్నారు. సమన్వయంతో అందరూ పని
చేసి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. శ్రీశైలంలో కుంభాభిషేకం అంశంపై
రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఇచ్చిన ఆరు వారాల గడువులోపల అందరి అభిప్రాయాల్ని
తీసుకుని నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ
కమిషనర్ యస్. సత్య నారాయణ , అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ పాల్గొన్నారు.