వాషింగ్టన్: మంటల్లో తగలబడుతున్న ఇంట్లోకి దూకి అందులోని వారిని హీరో రక్షించే సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అలాంటి సంఘటనే అమెరికాలోని అయోవా ప్రాతంలో జరిగింది. మంటల్లో దగ్ధమవుతున్న ఇంట్లోని నలుగురు తోబుట్టువులను రక్షించాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఈనెల 23న జరిగింది. ఇంట్లోని డోర్బెల్ కెమెరాలో నమోదైన భయానక దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇంట్లోంచి ప్రాణాలతో బయటపడిన వారిలో 8,14,17,22 ఏళ్ల వయసు వారిగా పోలీసులు తెలిపారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఇంటి యజమాని, నలుగురు పిల్లల తల్లి టెండర్ లెమన్. మన జీవితాలు శాశ్వతంగా మారిన రోజు! కానీ, బూడిద నుంచే కదా?? అంటూ రాసుకొచ్చారు. వీడియో ప్రకారం.. మంటల్లోంచి ముగ్గురు పరుగెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత అగ్ని జ్వాలలు మరింత అలుముకున్నాయి. కొద్ది సేపటికి ముందు నుంచి 22 ఏళ్ల యువకుడు సైతం అందులోంచి బయటకు వచ్చాడు. బ్రెండన్ బ్రిట్ అనే వ్యక్తి తన కారులో వెళ్తూ దారి తెలియక మరో మార్గంలో వెళ్లాడు. ఆ మార్గంలో ఓ ఇల్లు మంటల్లో కాలిపోతుండటాన్ని చూశాడు. వెంటనే అక్కడికి వెళ్లి కిటికీలను పగలగొట్టి లోపల ఎవరైనా ఉన్నారేమో పరీక్షించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అర్ధరాత్రి సమయం కాబట్టి ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటారని భావించానని, వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు బ్రిట్ చెప్పారు. మంటలు తీవ్రమవుతున్న క్రమంలో లోపలి ఉన్న వారిని అలర్ట్ చేసి ఇంటి గుమ్మం గుండా బయటకు పంపించినట్లు తెలిపారు. మరోవైపు.. స్మోక్ అలారం మోగకపోవటంతో తాము గాఢ నిద్రలో ఉన్నామని, బయట నుంచి అరుపులు విని లేచినట్లు బాధితులు తెలిపారు. ఆ సమయంలో వారి తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి వెళ్లారని చెప్పారు. ఈ సందర్భంగా బ్రిట్కు కృతజ్ఞతలు తెలిపారు ఇంటి యజమాని లెమన్. ఈ మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైందని, ఐదు పెంపుడు శునకాలు మృతి చెందాయని, మరో రెండు గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. అయితే, ఇంట్లో మంటలు చెలరేగాడానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టినట్లు రెడ్ ఓక్ ఫైర్ విభాగం తెలిపింది.