విజయవాడ : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి
నూతనోత్తేజం వచ్చిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజనాభివృద్ధి
శాఖల మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,
క్రీడలు, యువజనాభివృద్ధి శాఖలపై విజయవాడ బెర్మ్ పార్క్ లో మంగళవారం అధికారులతో
సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ
జీఐఎస్ ద్వారా ఏపీ ప్రభుత్వం బ్రాండ్ అంటే ఏంటో పారిశ్రామికవేత్తలకు
తెలిసిందని, అందుకే టూరిజం, హాస్పటాలిటీ రంగాలలో రూ.21,941 కోట్లతో 123
ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు. దీని ద్వారా 41,412 మంది రాష్ట్ర యువతకు
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. జరిగిన ఎంఓయూల్లో 40 డీపీఆర్ లు
ఇప్పటికే సబ్మిట్ చేయడం జరిగిందన్నారు. పెట్టుబడులకు ముందుకు వచ్చినవారికి
సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేకంగా కమిటీలను సైతం ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో
రాష్ట్రానికి పర్యాటకులు రావడం జరిగిందన్నారు.
క్రీడాకారులను కూడా ప్రోత్సహించేలా క్రీడా సంబరాలు
నిర్వహించామని వారికి కూడా రూ.50 లక్షల ఫ్రైజ్ మనీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ
క్రీడా పోటీల్లో ఎంపికైన క్రీడాకారులకు ఈ నెల 15 నుంచి శాప్ ద్వారా శిక్షణ
ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. యూత్ ఫెస్టివల్స్ వల్ల యువతకు తగిన
ప్రోత్సాహం లభించడంతో పాటు సరైన మార్గంలో నడిచేందుకు దోహదం చేస్తాయన్నారు.
జగనన్న ప్రభుత్వంలో అన్ని కాలేజీల్లో, స్కూళ్లలో ఈవిటీజింగ్ పూర్తిగా
అరికట్టారని, రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపారన్నారు. ఒబెరాయ్
గ్రూప్ ద్వారా పీపీపీ విధానంలో రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో విశాఖపట్నం,
రాజమహేంద్రవరం, తిరుపతి, హార్సిలీ హిల్స్, గండికోటలో రూ.1350 కోట్ల అంచనా
వ్యయంతో 7 స్టార్ హోటళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. దీనిద్వారా 10,900
మందికి ఉపాధి లభిస్తుందన్నారు. విశాఖపట్నం, తిరుపతికి సంబంధించి ఇప్పటికే
అగ్రిమెంట్లు పూర్తయ్యాయని, మిగిలినవి వీలైనంత త్వరగా అగ్రిమెంట్లు చేసుకుని
పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ నెల 29న వరల్డ్ డాన్స్ డే సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక మరియు
యువజనాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఆ
రోజున ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను సన్మానించాలని నిర్ణయం
తీసుకున్నామన్నారు. సంక్రాంతి, ఉగాది వంటి పండుగ దినాల్లో ప్రతి ఒక్కరూ
కుటుంబంతో సహా రాష్ట్రంలో పర్యటించేలా దానికనుగుణంగా టూరిజాన్ని అభివృద్ధి
చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఇప్పటికే టెంపుల్ టూరిజంలో
ఏపీ దేశంలోనే మూడవ స్థానంలో ఉందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రముఖ
దేవాలయాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో కేంద్రప్రసాద్ పథకం
క్రింద సింహాచలం ఆలయ అభివృద్ధికి రూ.54.04 కోట్లు, అన్నవరం దేవాలయ అభివృద్ధికి
రూ.54.17 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. తిరుపతి టెంపుల్
టూరిజంతో పాటు విశాఖలో నేచురల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలో 50
ప్రాంతాల్లో నూతనంగా బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు.