రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
విజయవాడ : దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం తలమానికంగా నిలుస్తుందని,
కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు
అమలు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బి. ఆర్.
అంబేడ్కర్ 132వ రాష్ట్ర స్థాయి జయంతి మహోత్సవాలు విజయవాడలోని తుమ్మలపల్లి వారి
క్షేత్రయ్య కళాక్షేత్రంలో శుక్రవారం వేడుకగా నిర్వహించారు. అంబేడ్కర్ జయంతి
వేడుకల్లో భాగంగా కళాక్షేత్రం ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి మంత్రులు,
ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, అధికారులు, నాయకులు పూలమాలలు వేసి
నివాళులర్పించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహానికి
పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ జయంతి మహోత్సవ వేడుకల సభకు విజయవాడ
సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రణాళికా సంఘ వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణువర్ధన్
సభాధ్యక్షులుగా వ్యవహరించగా ముఖ్య అతిథిగా హజరైన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
మేరుగు నాగార్జున మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నాటి సమాజంలో
నెలకొన్న అస్పృశ్యతపై పోరాడిన దీరోధాత్తుడని, ఆయన ఆశయ సాధన నేటి యువతకు ఆదర్శం
కావాలన్నారు. భారత దేశంలోని ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా
నిలుస్తుందంటే దానికి కారణం నాడు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే కారణమన్నారు.
అంబేడ్కర్ అడుగు జాడల్లో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన
నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే నేడు ఆ మహానేత బిడ్డ జగనన్న అవే
అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిస్తుండటం గొప్ప
విషయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 2.98 లక్షల కోట్లు పేదలకు సంక్షేమ
పథకాలు అందచేసిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని అన్నారు. అలాగే సంక్షేమ
ఫలాలు అందించటంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగనన్న ప్రభుత్వం పెద్దపీట
వేసిందని గుర్తుచేశారు. వసతి దీవెన, విద్యా దీవెన పథకాల్లో దాదాపు 10 లక్షలకు
పైగా దళిత విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని, పేద, బడుగు, బలహీన వర్గాల
విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉన్నత చదువులు చదవటానికి అవసరమైన
ఆర్థిక సాయం జగనన్న చేస్తున్నారని కొనియాడారు. అలాగే పెన్షన్ల పంపిణీలో,
జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయుత తదితర పథకాల్లో అర్హులైన
ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చుతున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని
విధంగా మన రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఇంటి తలుపు తట్టి మరీ సంక్షేమ ఫలాలను
అందిస్తున్నది జగనన్న ప్రభుత్వమేనన్నారు. డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ 125
అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున వేల కోట్ల విలువైన స్థలంలో రూ. 350
కోట్లకు పైగా నిధులతో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం త్వరలో ప్రారంభానికి
సిద్దంగా ఉందన్నారు.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ సంఘ సంస్కర్త,
గొప్ప మానవతావాది అంబేడ్కర్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ విద్య ద్వారా మాత్రమే
ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని, అంబేడ్కర్ నాడు సమాజంలో నెలకొన్న సామాజిక
అసమానతలను రూపుమపటానికి విద్య అనే ఆయుధాన్ని ఎక్కు పెట్టాడని గుర్తుచేశారు. మన
రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయ సాధనలో భాగంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న
జగనన్న ప్రభుత్వం పేద విద్యార్థులకు ఇంగ్లీషు చదువు చెప్పించటంతో పాటు వారికి
ఎటువంటి ఆర్థిక లోటు కలగకుండ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడని కొనియాడారు.
ఎమ్మెల్యే, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు వర్ధన్ మాట్లాడుతూ
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భారత దేశానికే తలమానికంగా నిలిచి అందరి మనస్సుల్లో
సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకున్నాడని, దేశంలో ఏ నాయకుడికి లేనన్ని
విగ్రహాలు ఒక్క అంబేడ్కర్ కే ఉన్నాయన్నారు. ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకున్న మన
నేత జగనన్న మధ్య దళారీలు లేకుండా ప్రభుత్వం నుంచి నేరుగా పేదలకు సంక్షేమ ఫలాలు
అందేలా చేస్తున్నాడని కొనియాడారు.
ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ దేశంలోని బడుగు, బలహీన వర్గాల కళ్లల్లో
వెలుగులు నింపింది డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అని అన్నారు. అణగారిన జాతుల
ఉద్ధరణకు నాడు అంబేడ్కర్ పాటుపడితే నేడు రాష్ట్రంలో జగనన్న పాటుపడుతున్నాడని
ప్రశంసించారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ అభినవ అంబేడ్కర్ మన
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు
సమ ప్రాధాన్యత ఇస్తూ, నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ అంబేడ్కర్ ఆశయ
సాధన దిశగా సాగుతున్న ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే
వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా యువత
నడుంబిగించాలని పిలుపునిచ్చారు. అందరూ సమానమే, అందరూ అభివద్ధి చెందాలన్న
లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం ముందుకు సాగుతున్న తీరు ప్రశంసనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వైజర్, సోషల్ జస్టిస్ జూపూడి ప్రభాకరరావు
మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలనకు అంబేడ్కర్ తన జీవితాన్ని త్యాగం చేసిన
మహనీయుడని కొనియాడారు. అంబేడ్కర్ ఆలోచనలను అందిపుచ్చుకున్న నేత మన జగనన్న అని
అన్నారు. మాదిగ వెల్ఫేర్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి
కనకారావు మాట్లాడుతూ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక అంబేడ్కర్ అని కొనియాడారు.
మట్టిలో పుట్టిన మాణిక్యం అంబేడ్కర్ అని సమాజంలో నెలకొన్న అసమానతలను
రూపుమాపేందుకు జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడన్నారు.
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత కత్తి పద్మారావు రచనలకు
ప్రోత్సాహకంగా మంత్రి మేరుగు నాగార్జున రూ. లక్ష చెక్కును కత్తి పద్మారావుకు
అందచేశారు. ముందుగా సాంఘిక సంక్షేమ శాఖ హస్టల్, స్కూల్ విద్యార్ధినీలు
దేశభక్తి గీతాలు ఆలపించి అలరించారు.
కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ రాయన భాగ్యలక్ష్మీ,
పలు కార్పొరేషన్ల ఛైర్మన్ లు, అధికారులు వడ్డాది మధుసూధనరావు, పి. గౌతమ్
రెడ్డి, తోలేటి శ్రీకాంత్, కూరపాటి గీతాంజలి దేవి, బండి శివశక్తి పుణ్యశీల,
అడపా శేషగిరి, టి. జమల పూర్ణమ్మ, సంపత్ విజాత, డిప్యూటీ మేయర్లు బెల్లం
దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, కార్పోరేషన్ల సమన్వయకర్త పుల్లారావు, సాంఘిక
సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మీ , డైరక్టర్ హర్షవర్ధన్, ఎన్.
టీ. ఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు.