దుబాయ్ : దేశంలో ఆందోళనకారులకు స్థానం లేదని ఆర్మీ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ హెచ్చరించారు. దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ దేశవ్యాప్త నిరసనలపై కఠిన చర్యలు చేపట్టాలని తమను ఆదేశిస్తే ఇస్లామిక్ రిపబ్లిక్లో ఆందోళనకారులకు చోటు ఉండదని బ్రిగేడర్ జనరల్ ఖైమార్స్ హైదరీ హెచ్చరించారు. జెహ్దాన్లోని సున్నీ నగరంలో నిరసనకారులపై భద్రతా బలగాలు విరుచుకుపడటంతో రక్తపాతానికి దారితీసింది. సెప్టెంబర్ 30న భద్రతా బలగాలు దాదాపు 66 మంది నిరసనకారులను హత్య చేశాయి. దీంతో జహ్దాన్ పోలీస్ చీఫ్‌ను అధికారులు తొలగించారు. ఈ ఘటన జరిగిన 40 రోజుల అనంతరం బ్రిగేడర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బురఖా ధరించలేదన్న కారణంగా ఖుర్దీష్ మహిళ మాసా అమ్నిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
కస్టడీలో ఆ మహిళ మృతి చెందడంతో ప్రభుత్వచర్యలను ఖండిస్తూ గత సెప్టెంబర్ నుండి దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మహిళలు జట్టు కత్తిరించుకుంటూ, హిజాబ్‌లను తగులబెడుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు, కార్మికులు, క్రీడాకారులు కూడా నిరసనలో భాగస్వామ్యం కావడంతో ప్రజా ఉద్యమంగా మారింది. జహ్దాన్లో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ కుర్దీష్కు చెందిన కొందరు దుకాణదారులు నిరసన చేపట్టినట్లు స్థానిక పత్రిక పేర్కొంది. 2016 నాటి ఉగ్రవాదం ఆరోపణలతో బలూచ్కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ప్రభుత్వం ఉరితీయడంతో ఈ ఆందోళనలు మిన్నంటినట్లు స్థానిక పత్రిక పేర్కొంది. బలూచ్‌లో 20 లక్షల మంది దాకా ఉన్న మైనారిటీలు దశాబ్దాలుగా అణచివేతను ఎదుర్కొంటున్నారని మానవహక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. సిస్తాన్, బలూచిస్తాన్, కుర్దీష్ ప్రాంతాలతో సహా రాష్ట్రంలో పలు మైనారిటీలు నివసించే ప్రాంతాల్లో అధ్వాన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది.