కరీంనగర్ : కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలందరి కంటి
ఆరోగ్యం మెరుగు కోసం చేపట్టిన రెండవ విడత కంటివెలుగు కార్యక్రమంలో నేడు
కరీంనగర్ లోని 42వ డివిజన్ లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి
గంగుల కమలాకర్ ప్రారంభించారు. దవాఖాన్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మొత్తం
ఆసుపత్రుల సిబ్బందే మీదగ్గరికి వచ్చి 13 రోజుల పాటు నిర్వహించే కంటి వెలుగు
కార్యక్రమంలో కేవలం ఆధార్ కార్డుతీసుకొని పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు.
కంటి సమస్యలతో పాటు కళ్లు మసకగా కనిపించినా వాటికి సంబందించిన మందులను సైతం
అందజేస్తారన్నారు మంత్రి గంగుల కమలాకర్. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలందరి
ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు, వయసు మీదపడ్డ వారికి మందగించే
కంటి చూపును కాపాడడానికే దేశంలో ఎక్కడా లేని విదంగా కంటివెలుగును
ప్రారంభించారన్నారు. అలాగే కేంద్రం సహాయం లేకున్నా ప్రజలందరికీ అందుబాటులో
ఉండాలని బస్తీ దవాఖానాలు, మెడికల్ కాలేజీలతో పాటు వేల కోట్లతో ప్రభుత్వ
ఆసుపత్రులను నిర్మిస్తున్నారని వాటితో పాటు టి డయాగ్నొస్టిక్స్ ద్వారా తెలంగాణ
ప్రజలందరికి ఆరోగ్య పరీక్షలు చేసి డిజిటలైజ్ చేస్తున్నామని దేశంలో ఇలాంటి
కార్యక్రమాలు కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే నిర్వహిస్తుందన్నారు. మొదటి
విడతలో కంటి వెలుగులో కేవలం కరీంనగర్ పట్టణంలోనే ఐదున్నర లక్షల మందికి
పరీక్షలు నిర్వహించి 76వేల మందికి రీడింగ్ గ్లాసులు అందజేసామని 30వేల మందికి
వెయ్యి రూపాయల పైబడి విలువగల సంపూర్ణ అద్దాలను అందజేసామని, 7800 మందికి
ఆపరేషన్లు నిర్వహించామన్నారు, నగరంలో నాలుగు బస్తీ దవాఖాన్లను ఏర్పాటు
చేసామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే కరోనా సంక్షోభంలోనూ ఆసరా ఫించన్లు,
ఉచిత బియ్యం, ఇతరత్రా సహాయంతో తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా
కాపాడుకున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలని గొప్పగా మనబడి కార్యక్రమం,
కమ్యూనిటీ హాళ్లు, ఇంకా అన్ని వర్గాల వారికి అందేలా అద్భుతమైన పథకాలు
రూపొందించారని, అంతగొప్ప మనిషైన కేసీఆర్ కి మనందరి దీవెనార్థులు
అందించాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి
సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్నన్, మున్సిపల్ కమిషనర్ సేవా
ఇస్లావత్, డివిజన్ కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్ రావ్ తదితరులు పాల్గొన్నారు.