*‘హిమాచలంలో’ రాచరికం నెగ్గేనా ? * ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగా కసరత్తు * వస్తోంది ఎన్నికల కాలం.. 2023 డిసెంబరు దాకా దేశంలో ఎన్నికలే ఎన్నికలు * హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ పార్టీల ప్రచార జోరు * లక్ష ఉద్యోగాలు..ఓపీఎస్ పునరుద్ధరణ…మహిళలకు రూ.1,500 : కాంగ్రెస్ హామీల వర్షం * ఉమ్మడి పౌర స్మృతి..ఉచిత స్కూటీలు..ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ * హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ
హిమాచల ప్రదేశ్:‘దేశంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికల సందడికి రంగం సిద్ధమైంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో రాచరికం ప్రజాస్వామ్య పరీక్షనెదుర్కొంటోంది. ఒకనాటి సంస్థానాధీశులు, రాజకుటుంబీకులు అనేక మంది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజామోదాన్ని కోరుతున్నారు. వీరిలో చాలామంది కాంగ్రెస్ తరఫున బరిలో ఉండటంతో అధికార భారతీయ జనతాపార్టీ దీన్నీ ఓ ఆయుధంగా మలచుకుంటోంది. ప్రజాస్వామ్యంలో రాజులు, రాణులు, రాచరికానికి స్థానం లేదంటూ ప్రచారం చేస్తోంది. రాచరికం పోయినా, హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో రాజ కుటుంబాల ప్రభావం ఇంకా కొనసాగుతునే ఉంది. రాంపుర్ బుషహర్ రాజకుటుంబానికి చెందిన వీరభద్రసింగ్ ముఖ్యమంత్రిగా, ఎంపీగా దాదాపు 50 సంవత్సరాల పాటు హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను శాసించారు. ఇప్పుడు ఆయన కుమారుడు విక్రమాదిత్య శిమ్లా గ్రామీణ సీటు నుంచి బరిలో ఉన్నారు.
వీరభద్రసింగ్ భార్య ప్రతిభాసింగ్ కోంతల్ రాజకుటుంబానికి చెందినవారు. మండి నుంచి ఎంపీగా ఎన్నికైన ఆమె భర్త వారసత్వాన్ని కొడుకు రూపంలో చూడాలనుకుంటున్నారు. చంబా రాజకుటుంబానికి చెందిన ఆశాకుమారి కూడా ఎమ్మెల్యేగా ఎంపికవటానికి కష్టపడుతున్నారు. డల్హౌసి సీటు నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న ఆమె గెలిస్తే ఇది ఆరోసారి అవుతుంది. శిమ్లా జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ అనిరుధ్ సింగ్ కోటి రాజకుటుంబ సభ్యుడిగా కసుమ్తి నుంచి బరిలో ఉన్నారు. కులులో బంజర్ నియోజకర్గం నుంచి కులు రాజవంశస్థుడు హితేశ్వర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొడుకు రంగంలోకి దిగటంతో కులు రాజుగా పేరొందిన ఆయన తండ్రి మహేశ్వర్‌సింగ్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. గతంలో కంటే తక్కువ సంఖ్యలోనే రాజకుటుంబాలు ఎన్నికల బరిలో దిగినా వారి ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై మాత్రం ఎక్కువే. హిమాచల్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 35. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 43, కాంగ్రెస్ 22 స్థానాలు దక్కించుకున్నాయి.
ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ అధికారం నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తీవ్రంగానే కసరత్తులు చేస్తోంది. ఇంకోవైపు, పంజాబ్‌లో తిరుగులేని విజయంతో మంచి జోరుమీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో మొత్తం 55,07,261 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27,80,208 పురుషులు కాగా 22,27,016 మంది మహిళా ఓటర్లు. ఈ ఎన్నికల్లో తొలిసారి 1,86,681మంది యువత ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 7,881 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.*
బీజేపీ సామాన్య అస్త్రం : అనేక మంది రాజ కుటుంబీకులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా వారందరిపైనా బీజేపీ వ్యూహాత్మకంగా సామాన్యులను పోటీకి దించింది. అంతేగాకుండా కాంగ్రెస్‌ను ‘రాచరిక’పు పార్టీగా, రాజులు, రాణులకు చెందిన పార్టీగా ప్రచారం చేస్తోంది. రాచరికం పోయినా ఈ కుటుంబాలు రాష్ట్రంపై పెత్తనం చెలాయించటానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శిస్తోంది. ఇటీవల ప్రచారానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ‘రాజులు, రాణుల కాలం కాదిది. సామాన్యులకు పట్టం కట్టే సమయమిది. ప్రజాస్వామ్యంలో రాచరికానికి స్థానం లేదు’ అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దీన్ని రాజవంశీయులు తిప్పికొడుతున్నారు. ‘ప్రస్తుత తరానికి అభ్యర్థి రాజవంశీయుడా, సామాన్యుడా అనేదానితో సంబంధం లేదు. అభ్యర్థి ప్రవర్తనను చూసి ఓటు వేస్తారు. ప్రజలకోసం పనిచేస్తే, వారి అభివృద్ధికి పాటుపడితే ఓటు వేస్తారు. రాజవంశీయులైనా సామాన్యుల్లా ప్రవర్తిస్తే అక్కున చేర్చుకుంటారని కోటి రాజవంశీయుడు అనిరుధ్‌సింగ్ వ్యాఖ్యానించారు. ప్రజలు మాత్రం రాజకుటుంబీలకు ఇచ్చే గౌరవాన్ని ఇంకా ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీరి ప్రభావం అధికంగానే ఉంది.‘హిమాచల్ ప్రదేశ్‌లో అనేక సంస్థానాలు, ప్రదేశాలకు వీరు రాజులనే సంగతిని ఎలా మారుస్తాం? సామాన్యులపై తప్పకుండా వారి ప్రభావం ఉంటుందని ఉనాకు చెందిన దుకాణదారు ఒకరు అభిప్రాయపడ్డారు. ఈనెల 12న జరిగే ఎన్నికల్లో రాజకుటుంబాలకు గౌరవం పేరుతో భూస్వామ్యుల చెరలో పడొద్దని భాజపా ఓటర్లను హెచ్చరిస్తోంది. బరిలో ఎవరో తెలిసిపోయిందిగాని ఎవరే పార్టీయో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా నియోజకవర్గం ప్రజలు. ఇక్కడ ఆరుగురు పోటీలో ఉన్నారు.
బీజేపీ పవన్‌కుమార్ కాజల్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈయన 2017 ఎన్నికల్లో ఇక్కడి నుంచే కాంగ్రెస్ టికెట్‌పై నెగ్గారు. ఈసారి బీజేపీలో చేరి టికెట్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈయన ప్రత్యర్థిగా సురీందర్‌కుమార్ కాకును కాంగ్రెస్ దించింది. సురీందర్ ఇన్నాళ్లూ బీజేపీలో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఇన్నాళ్లూ ఒకపార్టీలో ఉండి ఎన్నికల వేళ మరో పార్టీలోకి మారటంతో కార్యకర్తలతో పాటు ఓటర్లూ అయోమయంలో పడుతున్నారు.
గుజరాత్, హిమాచల్ ఎన్నికలకు నగారా : ‘దేశంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికల సందడికి రంగం సిద్ధమైంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. గుజరాత్ శాసనసభ గడువు 2023 ఫిబ్రవరి 18తో ముగియనుండగా హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తికానుంది. ఈ రాష్ట్రాలకు నవంబరు-డిసెంబరు మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్లో 182 శాసనసభ స్థానాలుండగా 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరిగి ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది. ఇక, హిమాచల్‌ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 43, కాంగ్రెస్ 22 స్థానాలు దక్కించుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది పంజాబ్‌లో అఖండ విజయం సాధించి మంచి జోరుమీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో జరగబోయే ఈ రెండు రాష్ట్రాల్లోనూ బరిలోకి దిగుతోంది.
ఈసారి మనదేశంలో ఎన్నికల కాలం : చలికాలం, ఎండాకాలం, వానాకాలాలతో పాటు ఈసారి మనదేశంలో ఎన్నికల కాలం కూడా వస్తోంది. వచ్చే నెల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో మొదలెడితే 2023 డిసెంబరు దాకా దేశంలో ఎన్నికలే ఎన్నికలు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లతో మొదలయ్యే ఈ ఎన్నికల సీజన్ వచ్చే డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దాకా కొనసాగుతుంది. ఈ ఏడాది కాలంలో 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత నాలుగైదు నెలల విరామంతో 2024లో లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలుంటాయి. షెడ్యూల్ ప్రకారం జరిగితే అప్పుడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా. ఇలా ఈ ఏడాదిన్నరంతా దాదాపు ఎన్నికల కోలాహలం ఉండబోతోంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా గత కొన్ని వారాలుగా ఈ రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. అనేక అభివృద్ధి పథకాలకు, పనులకు శ్రీకారం చుట్టారు.. ఈసారి గుజరాత్లో బీజేపీ కు గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్న ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా పర్యటనల పరంపర కొనసాగిస్తున్నారు. మోదీ స్వరాష్ట్రంలో వీలైతే జెండా పాతాలని, లేదంటే రెండోస్థానంలోనైనా నిలవాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు.
ఆ ఐదూ కీలకం : లోక్‌సభకు ముందు జరగబోతున్న ఈ పదకొండు అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు అత్యంత కీలకమైన రాష్ట్రాలున్నాయి. అవి గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ. వీటిలో రాజస్థాన్, తెలంగాణ తప్పిస్తే మిగిలిన మూడు రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉంది. ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్ కూడా 2023 డిసెంబరులో తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళుతుంది. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లే. వాటిని ఆ పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది ఆసక్తికరం. అసెంబ్లీ గడువు తేదీ లోపు కొత్త సభ కొలువుదీరేలా నెల రెండు నెలల ముందే ఎన్నికలు జరగొచ్చు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు నవంబరు 12న జరగనున్నాయి.