చైనాలో విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్ బీఎఫ్.7 భారత్‌ను భయపెడుతోంది. తాజాగా రెండు రోజుల క్రితం చైనా నుంచి ఆగ్రాకు వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. అతడి శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపారు అధికారులు.
కొవిడ్ తొలిసారి వెలుగు చూసిన చైనాలో మహమ్మారి మరోసారి ఉగ్రరూపం చూపిస్తోంది. కొవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 చైనాలో విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బీఎఫ్.7 వేరియంట్ కేసులు భారత్‌లో రాకుండా జాగ్రత్తపడుతోంది. అయితే రెండు రోజుల క్రితం చైనా నుంచి భారత్‌కు వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. బాధితుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 40 ఏళ్ల వ్యాపారి అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడు హోం ఐసోలేషన్‌లో ఉన్నాడని చెప్పారు. లఖ్‌నవూలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు అతడి నమూనాలను పంపినట్లు పేర్కొన్నారు.
“బాధితుడు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడిని కలిసిన వారికి, కుటుంబ సభ్యులకు కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసేందుకు ఆరోగ్య బృందాలను పంపాం. కొవిడ్ సోకిన వ్యక్తి డిసెంబరు 23న చైనా నుంచి దిల్లీ మీదుగా ఆగ్రాకు చేరుకున్నాడు. కరోనా లక్షణాలతో బాధపడిన అతడు ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నాడు. అప్పడు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. నవంబరు 25 తర్వాత ఇదే ఆగ్రా జిల్లాలో ఇదే మొదటి కేసు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇంట్లో హోం ఐసోలేషన్‌లో ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలి.”
అరుణ్ శ్రీవాస్తవ, చీఫ్ మెడికల్ ఆఫీసర్
ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవడం సహా కొవిడ్ టెస్టులు, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని ఇటీవలే స్పష్టం చేసింది. మరోవైపు, దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమైతే ఎలా వ్యవహరించాలన్నదానిపై మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ లభ్యత, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించాలని లేఖలో కోరింది.