భారత్ విధానాలు ప్రపంచానికి ఆదర్శం
డీపీఐతో విప్లవాత్మక మార్పులు
జి-20 ఎఫ్ఎంసీబీజీ సమావేశంలో నరేంద్ర మోడీ
బెంగళూరు : కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభ సమయంలో భారత్ అమలు చేసిన
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆయన బెంగళూరులో నిర్వహించిన జి-20 ఆర్థిక
మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సమావేశాన్ని ఉద్దేశించి
ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. భారతీయ వినియోగదారులు, ఉత్పత్తిదారులు దేశ
ఆర్థికరంగం పట్ల చూపిన ఆశావాదం నుంచి జి-20 సమావేశంలో పాల్గొన్న ప్రపంచదేశాల
ఆర్థికవేత్తలు స్ఫూర్తి పొందాలన్నారు. ఈ సమావేశంలోని చర్చలు బడుగువర్గాలకు
అందించే సేవలపై దృష్టి సారించాలని ప్రధాని సూచించారు. ప్రపంచమంతా ఆర్థిక,
రాజకీయ, ధరల పెరుగుదల, ఆహార, ఇంధన భద్రతకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్న
సమయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశం ఉత్తమ పరిష్కారాలు అందించేందుకు
ఉపయోగపడాలన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సంస్కరణలను వేగంగా అమలు చేయలేని
స్థితిలో ఉన్న నేపథ్యంలో ఆర్థిక, ద్రవ్య వ్యవస్థల సంరక్షకులు ప్రపంచ ఆర్థిక
రంగానికి భరోసా కల్పించాలన్నారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’
నినాదంతో భారత్ అధ్యక్షతన నిర్వహిస్తున్న జి-20 సమావేశాలు సమ్మిళిత
దార్శనికతను ప్రోత్సహిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.
డీపీఐతో విప్లవాత్మక మార్పులు : ఈ సందర్భంగా ‘సమర్థ పాలన, సమగ్ర అభివృద్ధి,
ఆవిష్కరణలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)’ అంశంపై
నిర్వహించిన సదస్సులో ఆర్థిక మంత్రులు, నిపుణులు మాట్లాడుతూ డీపీఐతో సామాజిక,
ప్రజా సేవల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యమయ్యాయని అభిప్రాయపడ్డారు. సేవల్లో
పారదర్శకత సాధ్యమైందని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి అజయ్సేథ్, డీపీఐ జి-20
టాస్క్ఫోర్స్ ఉపాధ్యక్షుడు నందన్ నిలేకని తదితరులు వివరించారు. ప్రజల్లో
ఆర్థిక స్వావలంబన, బాధ్యత, ఉత్పాదక సామర్థ్యం పెంచేందుకు డీపీఐ ఉపయోగపడిందని
అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో డీపీఐ వ్యవస్థను అమలు చేసిన
దేశాల అనుభవాలను ఆర్థిక మంత్రులు వెల్లడించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా
సీతారామన్, ఇండోనేసియా ఆర్థికమంత్రి ముల్యాని ఇంద్రావతి, బ్రెజిల్ కేంద్రీయ
బ్యాంకు గవర్నర్ రాబర్ట్ డి ఒలివైరా, ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివా
తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
సాంకేతిక రక్ష : సాంకేతికత సాయంతో ప్రపంచ ఆర్థికరంగం ప్రగతి సాధిస్తోందని
ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో డిజిటల్ చెల్లింపుల
విధానానికి సాంకేతికత దోహదపడిందన్నారు. భారత్ ఆవిష్కరించిన యూపీఐ డిజిటల్
చెల్లింపుల వ్యవస్థ భద్రత, విశ్వసనీయతకు పేరొందిందని, సరళమైన పాలన, సులభతర
జీవన విధానానికి ఉపయోగపడిందని తెలిపారు. ఈ వ్యవస్థ నేడు ప్రపంచానికి స్ఫూర్తి
నింపిందన్నారు. ఇదే సందర్భంగా డిజిటల్ చెల్లింపులు దుర్వినియోగం కాకుండా
పరిష్కారాలు వెతకాల్సిన బాధ్యత జి-20 భాగస్వామ్య దేశాలపై ఉందని ప్రధాని
సూచించారు. ప్రపంచ జనాభా 800 కోట్లు దాటినా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను
చేరుకోవటంలో వైఫల్యం కనిపిస్తోందన్నారు. ప్రపంచం ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లపై
దృష్టి సారించాలని వివరించారు.