హరితహారంతో మన అడవులకు పూర్వ వైభవం
తెలంగాణ అంతటా పచ్చదనం పరిఢవిల్లుతుంది
ప్రజా చైతన్యంతోనే లక్ష్య సాధన
భవిష్యత్ తరాలకు స్వచ్చ వాతవారణం అందించడమే లక్ష్యం
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రవీంద్రభారతీలో వేడుకగా హరితోత్సవం
పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ
హరితహారం ప్రగతి నివేదికను ఆవిష్కరించిన మంత్రులు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన హరితహారం దేశానికి
దిక్సూచిగా నిలుస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పచ్చదనానికి కేరాఫ్
అడ్రస్‌గా నిలిచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి
వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం రవీంద్రభారతిలో నిర్వహించిన
హరితోత్సవం ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ
వేడుకకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోం శాఖ మంత్రి
మహమూద్ అలీ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, వేర్
హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ సాయి చంద్, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (
పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్,
పీసీసీఎఫ్ (సామాజిక అడవులు) లోకేష్ జైస్వాల్, అటవీ అభివృద్ధి సంస్థ వైస్
చైర్మన్ & మేనెజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, అటవీ శాఖ, పంచాయతీరాజ్, ఇతర
శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
హరితహారం కార్యక్రమంపై రూపొందించిన లఘుచిత్రం, డాక్యుమెంటరీని
ప్రదర్శించారు. అనంతరం హరితహారం కార్యక్రమం ద్వారా సాధించిన ఫలితాలు,
ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. అడవుల పరిరక్షణకు విశేష కృషి
చేసిన అటవీ అధికారులు, సిబ్బంది, పలు గ్రామపంచాయతీల సర్పంచులు, గ్రామ
కార్యదర్శులను సత్కరించి, అవార్డుల ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ వానలకు, వనాలకు సంబంధం
ఉన్నదని,. చెట్లు లేకుండా వర్షాలు రావని, అందుకే తెలంగాణలో సమృద్ధిగా వానలు
కురిసేందుకు, అడవులను రక్షించి, చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడటమే
లక్ష్యంగా.. ‘‘వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలే’’, ‘‘జంగల్ బడావో –
జంగల్ బచావో’’ అనే నినాదంతో సీయం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం
సత్ఫలితాలను ఇస్తుందని అన్నారు. దూరదృష్టి, రాజకీయం సంకల్ప బలం ఉంటే
ఎడారిని కూడా హరితశోభితం చేయొచ్చని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్
రావు నిరూపించారని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, వీటి అమలు,
పర్యవేక్షణ కోసం బలమైన సంస్థాగత ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రజలకు బాధ్యతయుత
భాగస్వామ్యం కల్పించడంతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.
సీయం కేసీఆర్ దిశానిర్ధేశంలో తొమ్మిదేళ్ళలో తెలంగాణ అడవులు పూర్వ వైభవం
సంతరించుకున్నాయని తెలిపారు. మైదానాలుగా మారిన అడవుల్లో పచ్చదనం
పరిఢవిల్లుతుందని, పల్లెలు, పట్టణాలు పచ్చబడ్డాయని, గతంలో వలసపోయిన
జంతువులు మన అడవులకు తిరిగివస్తున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని
తిప్పేశ్వర అభయారణ్యం నుంచి పులులు సైతం వలస వస్తు…కవ్వాల్ టైగర్
రిజర్వ్ జోన్ ను సురక్షిత ఆవాసంగా ఏర్పరచుకున్నాయని చెప్పారు. ఇలా అడవుల
సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ చర్యలతో పాటు హరితహారం మంచి
ఫలితాలనిచ్చిందన్నారు. దేశంలోనే మొక్కల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ
స్థానంలో నిలిచిందని,. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుందని
వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేవలం తొమ్మిదేళ్ళలో హరితహారం
కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 273.33 కోట్ల మొక్కలు నాటామని, నిర్వహణ
కోసం ఇప్పటిదాకా 10,822 కోట్ల వెచ్చించినట్లు చెప్పారు. సంకల్ప బలం ఉంటే
అద్భుతాలు ఎలా చేయొచ్చో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం దేశానికి
ప్రత్యక్షంగా చూపిందని వ్యాఖ్యానించారు.