రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్.
విజయవాడ: రాష్ట్రంలో ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికి
ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్
ఆదిమూలపు సురేష్ అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలు
అందించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఆయన అన్నారు.
విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం గ్రామ వార్డు సచివాలయాల
వ్యవస్థ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు
సచివాలయాల్లో అందుతున్న సేవలను అధికారులు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. గ్రామ
వార్డు సచివాలయాల్లో దేశంలో ఎక్కడా లేనివిధంగా 19 పోర్టల్ ద్వారా సేవలు
అందుతున్నాయని ఈ సేవలపై ప్రజా ప్రతినిధులకు కూడా అవగాహన కల్పించేలా త్వరలో
సదస్సులు ఏర్పాటు చేయాలని ప్రజలకు కూడా పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని
మంత్రి సూచించారు. సచివాలయాల్లో అందుతున్న సేవలపై సెక్రటేరియట్ లో కూడా ఒక
డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయాల్లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా
ప్రజలకు మరిన్ని సేవలు అందుతున్నాయని మంత్రి అన్నారు. గ్రామీణ పట్టణ
ప్రాంతాల్లో ప్రజలకు వివిధ పథకాలను గత ప్రభుత్వం మాదిరి ఎటువంటి దళారీ వ్యవస్థ
లేకుండా నేరుగా డిబిటి సిస్టం ద్వారా ముఖ్యమంత్రి ప్రజలకు మేలు జరిగే
కార్యక్రమాలు చేపట్టారని ఆయన అన్నారు. ఏపీ సేవా పోర్టల్, జగనన్న తోడు,
వైయస్సార్ బీమా తదితర కార్యక్రమాల అమలు తీరుపై మంత్రి సమీక్షించారు.
పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
సంక్షేమ పథకాలు నేరుగా అవినీతి రహితంగా, త్వరగా అందాలనేది ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, ఆయన లక్ష్యం నెరవేర్చేలా అధికారులు, వాలంటీర్లు
సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని మంత్రి సురేష్ సూచించారు. ఈ సమావేశం లో
గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, స్పెషల్
సెక్రటరీ రాహుల్ పాండే, జాయింట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, అడిషనల్ డైరెక్టర్
భావన వశిష్ఠ, స్టేట్ కోఆర్డినేటర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.