న్యూఢిల్లీ : కాంగ్రెస్కు రాజీనామా చేస్తానని తానెప్పుడూ అనుకోలేదని మాజీ
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తప్పుడు నిర్ణయాల వల్లే
కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతోందన్నారు. నాయకత్వ లేమితో
కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోందన్నారు. బీజేపీ ఎదుగుతున్నకొద్దీ కాంగ్రెస్
దిగజారుకుంటూ వచ్చిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో బీజేపీలో
చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్
సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా
కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ సభ్యత్వాన్ని అరుణ్ సింగ్
అందించారు. కిరణ్ కుమార్ రెడ్డికి కండువా కప్పి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
పార్టీలోకి ఆహ్వానించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాజీ తో
ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దేశాన్ని వృద్ధి చేయాలన్నది బీజేపీ
లక్ష్యమన్నారు. గెలవాలనే తపన, దూరదృష్టి బీజేపీలో మాత్రమే ఉందన్నారు. నరేంద్ర
మోడీ, అమిత్షా డైరెక్షన్లో బీజేపీ దూసుకుపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి
పేర్కొన్నారు. అధిష్టానం తనకు ఏ పని అప్పగిస్తే అది చేయడానికి సిద్ధంగా
ఉన్నానని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్
రెడ్డి తో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు.