ఒక్కొక్కరు అయిదుగురిని దేశంలో పర్యటించేలా చేయండి
న్యూయార్క్ సమావేశంలో ప్రవాస భారతీయలకు కిషన్‌రెడ్డి పిలుపు
హైదరాబాద్ : ఉద్యోగాల కోసం మాతృదేశాన్ని వదిలివచ్చినా దేశాభివృద్ధికి ప్రవాస
భారతీయులు అండగా నిలుస్తున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర భాజపా
అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. న్యూయార్క్‌లో భారత కాన్సుల్ జనరల్
ఏర్పాటుచేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రపంచ ఫార్మారంగ రాజధానిగా,
ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్‌గా భారతదేశం ఎదుగుతున్న క్రమంలో దేశయువతతో పాటు,
ప్రవాస భారతీయులు పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రపంచమంతా
ఆర్థికమాంద్యం ప్రభావంలో చిక్కుకుంటే భారతదేశం మాత్రం స్థిరమైన అభివృద్ధితో
ముందుకెళ్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే
దీనికి కారణమన్నారు. ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన
భారతదేశానికి ఏటా 3 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని
తెలిపారు. విదేశీ మారక నిల్వలు 600 బిలియన్ డాలర్లు దాటాయన్నారు. ‘మేక్ ఇన్
ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కారణంగా ఎగుమతులు రూ.43,500 కోట్లు దాటాయని
చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ దేశంలో
ఏర్పాటైందన్నారు. 14 కీలక రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వడం
ద్వారా ఈ దశాబ్దిని భారతదేశం ‘టెక్ డెకేడ్’గా మార్చుకునే లక్ష్యంతో
ముందుకెళుతోందని చెప్పారు. ఒక్కో ప్రవాస భారతీయుడు కనీసం అయిదుగురు భారతీయేతర
మిత్రులను మనదేశంలో పర్యటించేందుకు ప్రోత్సహించాలని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా
పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు వారిని ప్రోత్సహించాలన్నారు. వచ్చే
25 ఏళ్లలో దేశాన్ని విశ్వగురుగా నిలబెట్టేందుకు ప్రవాసీయులు కూడా భాగస్వాములు
కావాలన్నారు. 1994లో యువ రాజకీయ నాయకులుగా నేటి ప్రధాని నరేంద్ర మోడీ తో కలిసి
పర్యటించిన సందర్భాన్ని కిషన్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. వైట్‌హౌస్ ముందు
నిలబడి ఫొటో దిగిన అంశాన్ని ప్రస్తావించారు. కార్యక్రమంలో న్యూయార్క్‌లో భారత
కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, డిప్యూటీ కాన్సుల్ వరుణ్ జెఫ్, భారత
పర్యాటక డీజీ మనీషాతోపాటు అధికారులు పాల్గొన్నారు.