భారత్ అభివృద్ధి సాధిస్తోంది
మౌలిక సదుపాయాల అభివృద్ధికి అండగా ఉంటాం
మా ప్రతి నిర్ణయం సామాన్యుడి జీవితాన్ని మెరుగు పర్చడం కోసమే
విశాఖపట్నం : విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ నగరం అని, ఇక్కడి ఓడరేపు చారిత్రకమైందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖది కీలకపాత్ర అని భరోసా ఇచ్చారాయన. శనివారం ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ‘ప్రియమైన సోదరీసోదరులారా.. నమస్కారం..’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు తెలుగులో అభివాదం చేశారు. ఆపై వేదిక మీదున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులకు అభివాదం తెలిపారు. ‘‘కొన్ని నెలల కిందట విప్లవవీరుడు అల్లూరి జయంతి వేడుకలో పాల్గొనే అవకాశం వచ్చింది. దేశంలో విశేషమైన నగరం ఇది. విశాఖ ఓడరేపు చారిత్రకమైంది. ఇక్కడ నుంచి రోమ్ వరకు వ్యాపారం జరిగేది. ఆరోజు కూడా విశాఖపట్నం ప్రముఖ వ్యాపారం కేంద్రంగా విరజిల్లుతోంది. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఏపీ ప్రజలకు గుర్తింపు ఉంది. అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. స్వభావ రీత్యా స్నేహపూర్వకంగా ఉంటారు. ప్రతీ రంగంలో మెరుగైన మార్పు కోసం తెలుగు ప్రజలు తపన పడతారు. అలాగే సాంకేతిక వైద్య రంగాల్లో ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇవాళ రూ. 10వేల కోట్ల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నాం. ఇవాళ ఏపీకి, విశాఖకు గొప్పదినం. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులు.. విశాఖ, ఏపీ ప్రజల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి. విశాఖ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి పరుస్తూనే ఫిషింగ్ హార్బర్‌ను ఆధునీకరిస్తాం. తీర ప్రాంతం వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తుంది. ఓడరేవుల ద్వారా వేల కోట్లలో వ్యాపారం జరుగుతుంది. విశాఖ ఫిఫింగ్ హార్బర్ అభివృద్ధితో మత్స్యకారుల జీవితాల్లో మార్పు వస్తుంది. దేశాభివృద్ధిలో ఏపీ కీలక భూమిక పోషించనుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. వెనుకంజ అస్సలు వేయదు అని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో తన ప్రసంగంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కంభంపాటి హరిబాబుల ప్రస్తావనను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చారు. ఏపీ, వైజాగ్ అభివృద్ధికి ఎంతో దోహదం చేశారని వాళ్లపై ప్రశంసలు గుప్పించారు. ఇప్పుడు చాలా దేశాలు వెనుకంజలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ అభివృద్ధి సాధిస్తోంది. వికాస భారత్ దిశగా మనం దూసుకుపోతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా భారత దేశమే అందరికీ ఆశావాహ దృక్పథం ఇస్తోంది. మేధావులు, నిపుణులు భారత్‌ను ప్రశంసిస్తున్నారు. భారత్.. ప్రపంచ దేశాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. రైతులకు ఏటా రూ.6వేల సాయం అందిస్తున్నాం. వెనుకబడిన జిల్లాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పేదల కోసం సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తున్నాం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు ప్రతీ అవకాశాన్ని వెతికి పట్టుకుంటాం. మా ప్రతి నిర్ణయం సామాన్యుడి జీవితాన్ని మెరుగు పర్చడం కోసమే అని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు.