‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు
క్షయ నిర్మూలనకు సహకరించాలని దేశ ప్రజలకు పిలుపు
న్యూఢిల్లీ : అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ)ని దేశ చరిత్రలో చీకటికాలంగా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆ గడ్డుకాలాన్ని ఎన్నటికీ
మరచిపోలేమన్నారు. ప్రజాస్వామ్యవాదులను అప్పట్లో తీవ్రంగా హింసించారని
గుర్తుచేశారు. ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం ఆయన పలు అంశాలపై మాట్లాడారు.
వాస్తవానికి ప్రతినెలా చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’ ఉంటుంది. అయితే
వచ్చేవారం ప్రధాని అమెరికా పర్యటనలో ఉండనున్న నేపథ్యంలో ఈసారి ఒకవారం
ముందుగానే దాన్ని ప్రసారం చేశారు. ‘‘భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి.
ప్రజాస్వామ్య విలువలు పరమోత్కృష్ఠమని, రాజ్యాంగం సర్వోన్నతమని మనం భావిస్తాం.
అందువల్ల 1975లో అత్యయిక స్థితిని విధించిన జూన్ 25ను ఎప్పటికీ మరిచిపోలేం.
దేశ చరిత్రలో అదో చీకటి కాలం. లక్షల మంది ప్రజలు ఎమర్జెన్సీని తీవ్రంగా
ప్రతిఘటించారు. నాటి అరాచకాలు, పోలీసులు/అధికార యంత్రాంగం విధించిన శిక్షల
గురించి ఎంతోమంది పుస్తకాలు రాశారు. ఆ సమయంలో నేనూ ‘సంఘర్ష్ మే గుజరాత్’ అనే
పుస్తకం రాశాను. అత్యయిక స్థితి రోజులను అభివర్ణిస్తూ ‘టార్చర్ ఆఫ్
పొలిటికల్ ప్రిజనర్స్ ఇన్ ఇండియా’ పేరుతో రాసిన పుస్తకాన్ని కొద్దిరోజుల
క్రితం చూశాను. ఎమర్జెన్సీ కాలంలో ప్రచురితమైన ఆ పుస్తకం ప్రజాస్వామ్య
పరిరక్షకులను నాటి ప్రభుత్వం ఎంతగా చిత్రహింసలు పెట్టిందో చాటిచెప్పింది. ఆ
పుస్తకంలో ఎన్నో వృత్తాంతాలు, చిత్రాలు ఉన్నాయి. దేశ స్వాతంత్య్రాన్ని
ప్రమాదంలోకి నెట్టిన అప్పటి నేరాల గురించి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ మనం
ఒకసారి మననం చేసుకోవాలి. దానివల్ల ప్రజాస్వామ్యం అర్థం, దానికున్న ప్రాముఖ్యత
గురించి ప్రస్తుత యువతరం సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది’’ అని
ప్రధాని పేర్కొన్నారు.
యోగాతో గొప్ప మార్పులు : ఈ నెల 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన
కార్యాలయంలో తాను యోగా దినోత్సవంలో పాల్గొనబోతున్నట్లు మోడీ తెలిపారు.
‘వసుధైక కుటుంబం కోసం యోగా’ అన్న ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా కార్యక్రమం
జరగబోతోందని చెప్పారు. ప్రతిఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగంగా మార్చుకోవాలని
ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికీ యోగాను ఆచరించకపోతే జూన్ 21 నుంచైనా దాన్ని
స్వీకరించాలని కోరారు. యోగాతో జీవితంలో గొప్ప మార్పులను చూడటం ఖాయమన్నారు.
*ప్రజా భాగస్వామ్యమే బలం : 2025 నాటికల్లా క్షయ (టీబీ) నుంచి దేశానికి
విముక్తి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దానికి అందరూ సహకరించాలని
మోదీ పిలుపునిచ్చారు. ‘‘ఒకప్పుడు క్షయ గురించి వింటేనే అందరూ పారిపోయేవారు.
కానీ ఇప్పుడు ఆ రోగులకు అండగా నిలుస్తున్నారు. గ్రామాలు, పంచాయతీల్లో వేలమంది
ముందుకొచ్చి టీబీ పేషెంట్లను దత్తత తీసుకుంటున్నారు. ఎంతోమంది పిల్లలు కూడా ఈ
విషయంలో ముందుకొచ్చారు. ప్రజా భాగస్వామ్యం ఈ ఉద్యమానికి పెద్ద బలం. దీనివల్ల
ప్రస్తుతం దేశంలో 10 లక్షలమందికిపైగా టీబీ రోగులను దత్తత తీసుకొనే పరిస్థితి
వచ్చింది. 85 వేలమంది నిక్షయమిత్రల కృషి ఫలితమే ఇది. ఎంతోమంది సర్పంచులు
గ్రామాల్లో క్షయ నిర్మూలనకు నడుంబిగించడం సంతోషకరం’’ అని ప్రధాని పేర్కొన్నారు.
మియావాకితో పచ్చదనం : దేశంలో పచ్చదనాన్ని విస్తరించడానికి జపాన్‌కు చెందిన
మియావాకి టెక్నిక్‌ను అనుసరించాలని ప్రధాని సూచించారు. భూసారం లేని
ప్రాంతాల్లో ఈ విధానాన్ని ఉపయోగించి మెరుగైన ఫలితాలు సాధించడానికి ఎంతోకాలం
పట్టదన్నారు. మియావాకి అడవులు వేగంగా విస్తరించి రెండు మూడు దశాబ్దాల్లోనే
జీవవైవిధ్య కేంద్రాలుగా మారుతాయని చెప్పారు. ఈ టెక్నిక్‌తో కేరళకు చెందిన రాఫి
రామనాథ్ అనే టీచర్ విద్యావనాన్ని సృష్టించి తన చుట్టుపక్కల ప్రాంత
ముఖచిత్రాన్ని మార్చారని పేర్కొన్నారు. ఈ వనాలు నగరాల్లో కూడా సులభంగా
పెరుగుతాయన్నారు. 2001 నాటి భుజ్ భూకంపంలో మరణించినవారికి గుర్తుగా
కొన్నిరోజుల క్రితం గుజరాత్ కేవడియాలోని ఏక్తానగర్లో తాను మియావాకి అడవిని
ప్రారంభించి, దానికి స్మృతివనంగా నామకరణం చేసినట్లు గుర్తుచేశారు. ఈ విధానంలో
ముంబయి చుట్టుపక్కల గత నాలుగేళ్లలో 60 వానాలు సృష్టించినట్లు చెప్పారు.
సింగపూర్, పారిస్, ఆస్ట్రేలియా, మలేసియాల్లో మియావాకిని విస్తృతంగా
అమలుచేస్తున్నట్లు తెలిపారు.
కచ్ త్వరగానే కోలుకుంటుంది : ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో మన దేశ
సామర్థ్యాలు బాగా మెరుగయ్యాయని ప్రధాని అన్నారు. ఇటీవలి బిపోర్జాయ్ తుపాను
మిగిల్చిన విధ్వంసం నుంచి గుజరాత్‌లోని కచ్ త్వరగానే కోలుకుంటుందని విశ్వాసం
వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల క్రితం సంభవించిన భూకంపం నుంచి కచ్
కోలుకోగలదా అని అప్పట్లో సందేహాలు వ్యక్తమయ్యాయని, కానీ స్థానికులు వాటిని
పటాపంచలు చేశారని గుర్తుచేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పరాక్రమాన్ని, ఆయన
పరిపాలనా దక్షతను ‘మన్ కీ బాత్’లో భాగంగా మోదీ గుర్తుచేసుకున్నారు. ఒడిశాలో
నిర్వహించే జగన్నాథ రథయాత్ర ఓ అద్భుతమని, ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్’
అనే ఆలోచనా ధోరణికి అది నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.