న్యూఢిల్లీ : ప్రవాస భారతీయులు మన భాష, సంస్కృతులకు సారధులుగా, వాణిజ్యానికి
వారధులుగా దేశ ప్రతిష్ఠను నిలబెట్టాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
పిలుపునిచ్చారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి తెలుగు అసోసియేషన్ ఏర్పాటు
చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘తెలుగువారి
కష్టపడే తత్వమే వారికి గుర్తింపును ఇస్తోంది. శాంతి, సౌభ్రాతృత్వం వారసత్వంగా
వచ్చిన మన సంస్కృతిలోని కట్టుబాట్లే భారతీయుల బలం. వేప పుల్ల మొదలుకుని,
అణుశాస్త్రం వరకూ ఎన్నో మెలకువలు ప్రపంచానికి నేర్పింది భారతీయులే.
పురోభివృద్ధిని కోరేవారు పూర్వ వృత్తాన్ని మరువకూడదు. మన కట్టు, బొట్టు, భాష,
ప్రాస, యాసలను కాపాడుకోవాలి. వ్యక్తి ఎంత స్థాయికి ఎదిగినా మాతృమూర్తి,
మాతృభాష, జన్మభూమి, గురువును మరవకూడదు. ప్రతి ఒక్కరూ జన్మనిచ్చిన గడ్డ
రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని
వణికిస్తున్న తరుణంలో ప్రవాస భారతీయులు ప్రశంసనీయమైన సేవలందించారని
పేర్కొన్నారు.