రాజ్‌కోట్ : భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ‘నూతన జాతీయ విద్యావిధానం’తో దేశంలో తొలిసారి ఓ సరికొత్త విద్యా వ్యవస్థను సృష్టించామని, గత ప్రభుత్వాలు బానిస మనస్తత్వంతో ఆ పని చేయలేకపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రం రాజ్‌కోట్‌లోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అమృత్ మహోత్సవాలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఐటీలు, ఐఐఎంలు, వైద్యకళాశాలల సంఖ్యను భారీగా పెంచామని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో మన ప్రాచీన ఘన వారసత్వాన్ని పునరుద్ధరించటానికి గత ప్రభుత్వాలు కృషి చేయలేదని మోదీ తెలిపారు. దీనికి కారణం వారి బానిస మనస్తత్వమేనని ఆరోపించారు. దీంతో విద్యావ్యవస్థ తిరోగమనబాట పట్టిందని అన్నారు. భారత ప్రాచీన గురుకుల వ్యవస్థను మోదీ ప్రస్తుతించారు. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో మన కీర్తిని ఇనుమడింపచేశాయని వివరించారు. పరిశోధననేది గురుకుల సంప్రదాయాల్లోనే ఉందని, ఈ రోజుల్లో కనిపిస్తున్న వైవిధ్యత, సాంస్కృతిక వైభవాలు నాటి ఆవిష్కరణల ఫలితాలేనని చెప్పారు. ఆత్మతత్వం నుంచి పరమాత్మతత్వం వరకు, ఆధ్యాత్మికత నుంచి ఆయుర్వేదం వరకు, సాంఘిక శాస్త్రాల నుంచి విజ్ఞాన శాస్త్రాలవరకు, గణితం నుంచి లోహశాస్త్రం వరకు ఇలా ఎన్నో రంగాల్లో పరిశోధన చేసిన ప్రాచీన భారతం ప్రపంచానికే మార్గం చూపిందని అన్నారు.