కండబలం, ధనబలం ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తోంది
జాతీయ ఓటరు దినోత్సవం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో జాతీయ ఓటర్ల దినోత్సవం
గుంటూరు : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. గురువారం స్థానిక కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయిన ఆమె విద్యార్దులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనకు లభించిన ఓటు హక్కు ఎంతో శక్తివంతమైన ఆయుధమని అన్నారు. ముఖ్యంగా యువత ఓటర్లపైనే దేశ భవిష్యత్తు ఆధారాపడి ఉందని అన్నారు. యువత దేశం కోసం, రాష్ట్ర అభివృద్ది కోసం ఆలోచించి మంచి నాయకులను తమ ఓటు ద్వారా ఎన్నుకోవాలని సూచించారు. యువత ఓటు హక్కు 2024 ఎన్నికల్లో దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తుందన్నారు. యువతకు జాతీయ భావాలు ముఖ్యమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నేడు భారత్ కు ఉన్న ప్రతిష్ట ప్రధాన మంత్రి నరేంద్ర మోది వలననే సాధ్యమయిందన్నారు. దేశంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో సాంస్కృతిక, ఆర్ధీక అభివృద్దికి కట్టుబడి నరేంద్ర మోది పాలన సాగిస్తున్నారని తెలిపారు. భారత పౌరులు గర్వించే విధంగా భారత దేశాన్ని విశ్వ గురు స్థానంలో నిలబెట్టడానికి నరేంద్ర మోడీ అనునిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. నరేంద్ర మోది కృషితో అయోధ్యలో బాలరాముడికి ఐదు వందల సంవత్సరాల తరువాత ప్రాణ ప్రతిష్ట జరిగిందని గుర్తు చేశారు. ఇది దేశం గర్వించదగ్గ విషయమన్నారు. చరిత్ర లో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డాలు దేశం కోసం పాటు పడుతున్నారని అన్నారు. ఇటువంటి నాయకత్వం ఎల్లవేళలా దేశానికి అవసరమన్నారు. సరైన సమయంలో మనకు సరైన నాయకత్వం ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. స్వామి వివేకానంద ప్రసంగాలతో యువత స్పూర్తి పొందాలని సూచించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో మొట్ట మొదటి సారి 1952లో ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. నాటి ఎన్నికలకు భారత ఎన్నికల కమీషన్ కు ముఖ్య ఎన్నికల అధికారిగా సుకుమార్ సేన్ వ్యవహరించారన్నారు. దేశ వ్యాప్తంగా 35కోట్లమంది ఓటర్లు తమ టు హక్కును వినియోగించుకున్నారని అందుకు గాను 62కోట్లు బ్యాలెట్ పత్రాలు అవసరమయ్యాయని అన్నారు. నాడు దేశంలో అక్షరాస్యత 32శాతం ఉండగా 78 శాతం పోలింగ్ జరిగిందన్నారు. అయితే ఇప్పుడు అక్షరాస్యత శాతం పెరిగిందన్నారు. కాని పోలింగ్ శాతం మాత్రం 51.52 శాతానికి పడిపోయిందన్నారు. 140 కోట్లు జనాభా ఉన్న మన దేశంలో సగానికి పైగా ఓటు హక్కును వినియోగించుకోకపోవడం సరికాదన్నారు. గతంలో నీతివంతమయిన రాజకీయాలు ఉండేవన్నారు. కానీ నేడు రాజకీయ వ్యవస్థ కలుషితమయిందన్నారు. నేటి ఎన్నికలు కండ బలం, ధన బలం, కుల బలం మీద ఆధారపడ్డాయని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. 2024లో ఎన్నికల ప్రక్రియ 30రోజుల్లో పూర్తి కానుందన్నారు. బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ కృష్ణ మాట్లాడుతూ యువత స్టార్ట్ ప్ ఇండియా కు దిక్సూచి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ వైస్ చాన్సులర్ డాక్టర్ జి.పార్థసారథి వర్మ, వైస్ చాన్సులర్లు డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, విద్యార్ది సంక్షేమ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్. హనుమంతరావు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, బిజెవైఎం నాయకులు మాధవ్, చైతన్య శర్మ,డాక్టర్ అభిరుచి మధు తదితరులు పాల్గొన్నారు.
యువత ఉపాధి : యువత కు ఉపాధి అవకాశాలు పెంచి న ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదే అన్నారు. దిగుమతులు తగ్గించుకుని ఎగుమతులు పెంచుకోవడానికి వివిధ రకాల కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న విషయం విద్యార్థులకు వివరించారు.
యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలోని ఇంక్యుబిలేటర్ ల్యాబ్ ను పురంధేశ్వరి పరిశీలించారు.