హైదరాబాద్ : తెరాస ఎమ్మెల్యే ఎర కేసు తరవాత తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. తెరాస, బీజేపీ నేతలు ఇరువురు ఒకరికి ఒకరు ప్రత్యక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. కేసీఆర్ చండూర్ సభలో బీజేపీని విమర్శిస్తే అదే రోజు బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రతి విమర్శలు చేశారు. తాజాగా నేడు హరీశ్‌రావు బీజేపీపై విరుచుకు పడ్డారు. అబద్ధాలు మాట్లాడటం బీజేపీ డీఎన్ఏగా మారిపోయిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. చండూరులో నిన్న కేసీఆర్ సభతో వారి వెన్నులో వణుకు పుట్టిందన్న ఆయన అందుకే ఇష్టానుసారంగా అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పలేదంటున్న బీజేపీ నేతలు అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన మార్గదర్శకాలను చూడాలని చెప్పారు. ప్రభుత్వానికి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా రైతుల కోసం వాటన్నింటిని కేసీఆర్ తిప్పికొట్టారన్నారు. చేనేతపై జీఎస్టీ అంశంలో తాను సంతకం చేశాననటం పచ్చి అబద్ధమన్న హరీశ్ 2016లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లిన ఈటల రాజేందర్‌ను ఈ అంశం గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు.