గోపాల్పేట : మాయమాటలు చెప్పి దోచుకునే వారికి ఓట్లు వేయొద్దని బీఎస్పీ
రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార
యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా గోపాల్పేట, రేవల్లి మండలాల్లో ఆయన
పర్యటించారు. ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించారు. గోపాల్పేట మండలం
బుద్దారం గ్రామంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ‘‘ మరో 3 నెలల్లో ఎన్నికలు
రానున్నాయి. దొంగలకు ఓట్లేస్తే బుద్దారం జలాశయం నిర్మాణంలో భూములు మునిగినట్లు
మనల్నీ ముంచుతారు. ఉద్యోగాలు అమ్ముకున్న కేసులో బుద్దారం గురుకుల పాఠశాలలో
పనిచేసే ఓ ఉపాధ్యాయురాలి పాత్ర కూడా ఉంది. భారాస ప్రభుత్వం పేదలకు రెండు పడక
గదుల ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ మాత్రం రూ.150 కోట్లతో 40 గదుల
ఇల్లు కట్టుకున్నారు. దాని బయట, లోపల 200 మంది చొప్పున పోలీసులు కాపలా ఉంటారు.
మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా లోపలికి రానివ్వరు. ఇప్పటికైనా ప్రజలు
మేల్కోవాలని’ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.