కొవ్వూరు : ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముందుకు దూసుకెళ్తున్నారు. దీనిలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలో ఈ నెల 25వ తేదీన గురువారం నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం, నియోజవర్గ నాయకుల పరిచయ వేదిక, విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 9:00 గంటలకు దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామం చేరుకుని, 9:30 గంటలకు యర్నగూడెంలో నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు క్యాంపు ఆఫీస్ నుండి ద్వారకా తిరుమల వరకు ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ద్వారకా తిరుమల కాపు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న లేఅవుట్ వద్ద వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో హోంమంత్రి తానేటి వనిత అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పరిచయ కార్యక్రమంతో పాటు విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి గోపాలపురం నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు,
నాయకులు, కార్యకర్తలు, అభిమానుల వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. జగనన్న ప్రభుత్వాన్ని, గోపాలపురం నుంచి తనను వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు.