హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా ధ్యాన కేంద్రంలో మహర్షి వేదిక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో*ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ 10 వేల మందితో బుధవారం నిర్వహించిన వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఈవెంట్ కు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ధ్యాన అభ్యాసీలతో కలిసి మంత్రి జూపల్లి సామూహిక ధ్యానం చేశారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఆధ్యాత్మిక ప్రపంచంలో దాదాజీ సేవలు ఎంతో గొప్పవని అన్నారు. కన్హా శాంతివనంలోని పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని, ఇదొక పవిత్ర స్థలం అనే భావన కలిగిందని చెప్పారు. 150కిపైగా దేశాల్లో రామచంద్ర మిషన్ సేవలందిస్తుండటం, ధ్యానం ద్వారా ఆథ్యాత్మిక పురోగతి, ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతుండటం గొప్ప విషయమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం మన రాష్ట్రంలో ఉండటం మనకు గర్వ కారణమని తెలిపారు. దేశ, విదేశాల నుంచి వచ్చే అభ్యాసకులతోపాటు చూట్టు పక్కల గ్రామాల ప్రజలకు కన్హా సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నేటి ఉరుకులు పరుగుల జీవితంగా మనుషులు ప్రశాంతత కోల్పోయి ఒత్తిడికి గురవుతున్నారు. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరు ధ్యానాన్ని జీవితంలో భాగంగా చేసుకుని ప్రతి రోజు ధ్యానం, యోగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, డా. టోనీ నాడర్ (మహారాజా అధిరాజ్ రాజారామ్) న్యూరో సైంటిస్ట్ , హెడ్ గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్, దాజీ శ్రీ రామచంద్ర మిషన్ అధిపతి, డాక్టర్ జోస్ లూయిస్ అల్వారెజ్ (రాజా లూయిస్), ప్రాజెక్ట్ డైరెక్టర్, హెడ్ గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్, శేఖర్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు.