‘నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది.
తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల
ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల
పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి
విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని
ప్రార్థిస్తున్నానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
‘బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా
వెంట నడిచిన ఆ అడుగులు చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి
దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా
కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ,
స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
నారా లోకేష్ అన్నారు.
‘సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది.
నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ
వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ
సానుభూతి’-. విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ
తారకరత్న మృతికి గవర్నర్ సంతాపం
విజయవాడ : సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు మనవడు నందమూరి తారకరత్న శనివారం మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం మెరుగవుతుందనుకుంటున్న దశలో మృత్యువుకు చేరువ కావటం బాధాకరమన్నారు. తారక రత్న కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.