హైదరాబాద్ : నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించి మోసం చేసే వారిపై కఠిన
చర్యలు తప్పవని రాచకొండ పోలీసు కమిషనర్ చౌహాన్ హెచ్చరించారు. నకిలీ
విత్తనాలను అరికట్టేందుకు కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను
ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. నకిలీ విత్తనాల సరఫరా, క్రయ విక్రయాలపై
తీసుకోవలసిన చర్యల మీద వ్యవసాయ శాఖ అధికారులతో రాచకొండ సీపీ ప్రత్యేక సమన్వయ
సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనాల కట్టడిలో వ్యవసాయ అధికారులకు రాచకొండ
పోలీస్ కమిషనరేట్ తరపున పూర్తి సహకారం అందిస్తామని కమిషనర్ తెలిపారు.
బాగా పరిశీలించి కొనుగోలు చేయాలి
ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు
రాచకొండ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను
అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నకిలీ విత్తనాలను అమ్మేవారిపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. గత
ఐదేళ్లలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు నకిలీ విత్తనాల అమ్మకం, సరఫరా
చేసిన 14 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వివరించారు. ప్రజలు నకిలీ
విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించాలన్నారు. విత్తనాల
ప్యాకెట్ల మీద అధీకృత సమాచారం, లోగో, హోలోగ్రాం వంటి వాటిని బాగా పరిశీలించి
తరువాతే కొనుగోలు చేయాలని ఆయన పేర్కొన్నారు.
ధ్రువీకరించిన కంపెనీల నుంచే కొనాలి
రైతులు నష్టపోకుండా వ్యవసాయశాఖ అధికారులు ధ్రువీకరించిన ప్రముఖ కంపెనీల
విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, వ్యాపారస్తుల నుంచి తీసుకున్న బిల్లులు
కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని సీపీ రైతులకు సూచించారు. రాచకొండ కమిషనరేట్‌లోని
వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు విత్తనాల దుకాణాలపైన
ఆకస్మికంగా దాడులు చేసి ప్రతి షాపులో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని
చెప్పారు. నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు ఎవరైనా విక్రయిస్తే వారిపైన
చట్టపరమైన కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
100కి కాల్ చేయండి : తక్కువ ధరకు పత్తి విత్తనాలు, మరేమైనా విత్తనాలు ఇస్తామని
మాయమాటలు చెప్పిన వారి వివరాలను ప్రజలు పోలీసులకు తెలపాలని సూచించారు. నకిలీ
విత్తనాల పట్ల ప్రతి ఒక్క రైతు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విత్తనాల గురించి
ఎటువంటి ముందస్తు సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమాచారం
ఇవ్వాలని ప్రజలను కమిషనర్ చౌహాన్ కోరారు.
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు
నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను
నియమించామని.. వారు వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీ విత్తన,
ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలను,
ఎరువులు, నాసిరకం పురుగుల మందులను ముందుగా గుర్తించడం అడ్డుకోవడం కట్టడి
చేయడం, వారు ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు, ప్రైమరీ కాంటాక్ట్, తదితర
అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో
యాదాద్రి భువనగిరి, మల్కాజిగిరి- మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల అగ్రికల్చర్
అధికారులు వారీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.