తిరుపతి : విశాఖపట్నంలో నవంబరు 14న కార్తీక మహాదీపోత్సవం నిర్వహణపై టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం జెఈవో సదా భార్గవితో కలిసి తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి దీపోత్సవాన్ని జయప్రదం చేయాలన్నారు. వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతంగా ముందస్తుగా పాసులు మంజూరు చేయాలని, సంప్రదాయ దుస్తుల్లో రావాలని తెలియజేయాలని సూచించారు. భక్తులందరికీ కార్యక్రమ బుక్లెట్ అందించి మొదట్లో చక్కగా మార్గదర్శనం చేయాలన్నారు.
కార్తీకదీప మహత్యాన్ని స్థూలంగా తెలియజేయాలని కోరారు. ఒక కార్యక్రమానికి మరో కార్యక్రమానికి మధ్య విరామం ఉండకూడదన్నారు. ప్రముఖ విద్వాంసులు శ్రీ చైతన్య బ్రదర్స్ అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో రూపొందించిన నృత్యరూపకాన్ని స్థానిక కళాకారులు ప్రదర్శిస్తారని చెప్పారు. దీపారాధన తరువాత భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పించాలని ఆయన జెఈవోను కోరారు. కార్యక్రమాన్ని ఆకట్టుకునేలా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమీక్షలో ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ్ కుమార్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, దాతలు రాజేష్, కృష్ణప్రసాద్, హిమాంశుప్రసాద్, ఎస్వీ వేద వర్సిటీ డైరెక్టర్ రాణిసదాశివమూర్తి, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.