విజయవాడ : దేశంలో అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే
అని ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
అన్నారు. పూలే వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు నగర
డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో కలిసి ఆ
మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా
దేశానికి మహాత్మ పూలే అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మల్లాది
విష్ణు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటుబడిన దీనజన
బాంధవుడు జ్యోతిరావు పూలే అని కీర్తించారు. కులవివక్షని ప్రత్యక్షంగా
అనుభవించిన ఆయన దానిని రూపుమాపేందుకు తుది శ్వాస వరకు కృషి చేశారన్నారు. ఆయన
రచనలు, ఉపన్యాసాలు ప్రత్యక్ష అనుభవాలతో నిండి ఉండేవన్నారు. దళిత, బహుజన వర్గాల
అభ్యున్నతి కోసం పూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని మల్లాది విష్ణు
పేర్కొన్నారు. స్త్రీలకు విద్యను అందించడం కోసం తన భార్య సావిత్రీబాయికి చదువు
చెప్పి ఉపాధ్యాయురాలిగా మలిచిన మేధావి అని కొనియాడారు. కనుకనే పూలేను భారత
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన గురువుగా
ప్రకటించుకున్నారన్నారు. విద్యతోనే సామాజిక ఆర్ధిక సమున్నతికి బాటలు పడతాయన్న
మహాత్మా పూలే ఆలోచన విధానమే స్ఫూర్తిగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు
సాగుతోందని మల్లాది విష్ణు తెలిపారు. ఆ మహనీయుని స్ఫూర్తితో సీఎం వైఎస్
జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ,
మైనారిటీ, మహిళా వర్గాల అభ్యున్నతికి ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు దేశానికే ఆదర్శంగా నిలవడం వెనక మహాత్మా పూలే వంటి
దార్శనికుల స్ఫూర్తి ఇమిడి ఉందని స్పష్టం చేశారు. పూలే ఆశయాల సాధనకు
ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.
నగర డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి మాట్లాడుతూ అంటరానితనం, కుల వివక్షకు
వ్యతిరేకంగా సమసమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడని
మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. సాంఘిక అసమానతలను రూపు మాపడానికి పూలే
శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ
కార్పొరేటర్లు కుక్కల అనిత, ఇసరపు దేవీ రాజారమేష్, ఉమ్మడి రమాదేవి, యరగొర్ల
తిరుపతమ్మ, ఎండి షాహినా సుల్తానా, ఉద్ధంటి సునీత, కొంగితల లక్ష్మిపతి, శర్వాణి
మూర్తి, కో ఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి,
అఫ్రోజ్, హఫిజుల్లా, కాళ్ళ ఆదినారాయణ, బత్తుల దుర్గారావు, పఠాన్ నజీర్ ఖాన్,
శ్యామ్, ఇస్మాయిల్, బాబు, ఫాతిమా, తోపుల వరలక్ష్మి, త్రివేణి రెడ్డి, మీసాల
బాలనాగమ్మ, యక్కల మారుతీ, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.