33 వ డివిజన్ 215, 217 సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ సెంట్రల్ : నవరత్నాల పథకాలతో పేదల సామాజిక, ఆర్థికాభివృద్ధికి చర్యలు
తీసుకోవడంతో పాటుగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం
విశేషంగా కృషి చేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు పేర్కొన్నారు. 33 వ డివిజన్ 215, 217 వార్డు సచివాలయాల పరిధిలో
స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమం నిర్వహించారు. వ్యాకరణం వారి వీధి, తాడంకి వారి వీధులలో పర్యటించి
నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును లబ్ధిదారులకు సంక్షేమ బుక్ లెట్ల ద్వారా
వివరించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా
సత్కరించి.. తమ సంపూర్ణ మద్ధతు తెలియజేశారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల
అభిప్రాయాలను తెలుసుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను
ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందని మల్లాది విష్ణు
అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ఓ అద్భుతమైన కార్యక్రమమని, ప్రభుత్వ
యంత్రాంగమంతా ప్రజల ఇంటి వద్దకే వస్తుండటంతో సుధీర్ఘ కాలం స్థానికంగా
నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి
వచ్చాక డివిజన్లో 13 నూతన రహదారులను నిర్మించినట్లు మల్లాది విష్ణు తెలిపారు.
వందనపు వారి వీధి, వ్యాకరణం వారి వీధి, తిరుమల రావు వీధి, ముదిగొండ వారి
వీధులలో కొత్త రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించగా త్వరలో పనులు
ప్రారంభిస్తామని తెలియజేశారు. అలాగే తాడంకి వారి వీధిలోనూ రహదారి నిర్మాణానికి
అంచనాలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ విభాగానికి సూచించారు.
టీడీపీ పరిస్థితి ఏంటో అచ్చెన్నాయుడు గతంలోనే చెప్పారు
పార్టీ లేదు, తొక్కా లేదని తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా టీడీపీ రాష్ట్ర
అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పింది అక్షర సత్యమని మల్లాది విష్ణు అన్నారు.
చంద్రబాబు గత ఐదేళ్ల పాలనంతా అహంభావంతో., సామాన్య, పేద కుటుంబాలను ఇబ్బందులకు
గురిచేసేలా సాగిందని ఆరోపించారు. కనుకనే 2019 లో రాష్ట్ర ప్రజలందరూ కర్రు
కాల్చి టీడీపీకి వాతపెట్టారని ఎద్దేవా చేశారు. అయినా టీడీపీ నేతల తీరు
మారలేదని.. చివరకు కార్మికుల సొమ్మును దోచుకుని అరెస్టైన అచ్చెన్నాయుడు కూడా
ముఖ్యమంత్రి గూర్చి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో
ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వానికి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో
సహా 99 శాతం హామీలను అమలు చేసిన తమ ప్రభుత్వానికి మధ్య ఎంతో వ్యాత్యాసం ఉందని
మల్లాది విష్ణు చెప్పారు. ఒంటిచేత్తో 151 స్థానాలను గెలిపించుకున్న దమ్మున్న
నేత సీఎం జగన్ అని.. గతిలేక అన్ని పార్టీలను కలుపుకుంటున్న పార్టీ
తెలుగుదేశమని విమర్శించారు. కనుక ఎవరు దద్దమ్మో అచ్చెన్నాయుడు విజ్ఞతకే
వదిలేస్తున్నామన్నారు. మరోవైపు వారాహికి డీజిల్ అయిపోయిందని మల్లాది విష్ణు
ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నోటాతో పోటీ పడే పార్టీలు, ఒక్క సీటు ఉన్న
పార్టీలు ఎంత తలక్రిందులుగా తపస్సు చేసినా ఒరిగేదీ ఉండదని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ
జగదీశ్వరి, డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, నాయకులు ఉప్పు రంగబాబు,
మైలవరపు రామకృష్ణ, శనగవరపు శ్రీనివాస్, కమ్మిలి రత్న, చాంద్ శర్మ, తాడేపల్లి
నారాయణ, లంకా బాబు, కొప్పరపు మారుతి, మారుతి ప్రసన్న, యర్రంశెట్టి అంజిబాబు,
కొల్లూరు రామకృష్ణ, సనత్, చల్లా సుధాకర్, బెజ్జం రవి, సచివాలయ సిబ్బంది
పాల్గొన్నారు.