అమరావతి : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సభ
మొదలవగానే ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని
మొదలుపెట్టారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం పాలన సాగుతోందన్నారు.
సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. ఏపీ లో
నవరత్నాలతో సంక్షేమ పాలన జరుగుతోందని గవర్నర్ నజీర్ పేర్కొన్నారు. డీబీటీ
ద్వారా అవినీతి లేకుండా లబ్దిధారులకే సొమ్ము అందజేస్తున్నామన్నారు. గ్రామ
సచివాలయాలతో ప్రజల దగ్గరకే పాలన అందిస్తున్నామని తెలిపారు. 45 నెలల్లో 1.97
లక్షల కోట్ల నగదు ప్రజలకి చేరిందన్నారు. లబద్ధిదారుల గుర్తింపుకోసం
వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆర్థికాభివృద్ధిలో
ఏపీ ముందడుగులో ఉందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాలు అభివృద్ధి
చెందుతున్నాయన్నారు. 2020-21లో జీఎస్డీపీ వృద్ధి రేటులో ఏపీ నెంబర్ 1
స్థానంలో ఉందన్నారు. మొత్తంగా 11.43 శాతం అభివృద్ధి సాధించామని గవర్నర్
తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నాడు-
నేడుతో స్కూళ్ల ఆధునీకరణ, మధ్యాహ్న భోజనం పథకం అమలులోకి తెచ్చామన్నారు. నాడు
నేడులో 3669 కోట్లతో ఫేజ్ 1లో 15717 స్కూళ్ల ఆధునీకరణ చేశామని, ఫేజ్ 2లో
8345 కోట్లతో 22345 స్కూళ్ల ఆధునీకరణ జరిగిందన్నారు. 9,900 కోట్లతో 44 లక్ష
మంది తల్లులకు అమ్మ ఒడి అందజేసినట్లు చెప్పారు. ఏటా రూ. 15 వేలు ఒక్కో
లబ్ధిదారుకి అమ్మ ఒడి ద్వారా లబ్ధి పొందారని వెల్లడించారు. రూ.690 కోట్లతో
5.20 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు అందజేశామన్నారు. జగనన్న గోరుముద్దతో
43.26 లక్షల మందికి మేలు చేశామన్నారు. ప్రతి మండలంలో కనీసం 2 జూనియర్
కాలేజీలు ఉన్నాయని తెలిపారు. ఆరోగ్యశ్రీలో 3255 రోగాలకు చికిత్స
అందజేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ చికిత్స కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చామని
అన్నారు. వైద్య శాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు పంపిణీ జరిగిందన్నారు.
రూ.971 కోట్లతో ఆరోగ్య ఆసరా పథకం అమలు చేసినట్లు తెలిపారు. గర్భిణీలకు
పౌష్టికాహారంతో నవజాత శిశు మరణాలు 19 శాతం తగ్గుదల అయ్యిందని గవర్నర్ అబ్దుల్
నజీర్ పేర్కొన్నారు. అయితే గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేకపోవడం
గమనార్హం. ఇప్పటి వరకూ ప్రతి ప్రసంగంలోనూ మూడు రాజధానుల అంశం ఉండేంది.
పరిపాలనా వికేంద్రీకరణపై ప్రస్తావన ఉండేది. నేటి వరకూ త్వరలోనే విశాఖ
వెళ్తానంటూ సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల
అంశం లేకపోవడానికి కారణం సుప్రీంకోర్టు విచారణనేనని తెలుస్తోంది. గవర్నర్ కూడా
సుదీర్ఘకాలం పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడంతో ప్రభుత్వం వెనక్కి
తగ్గిందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.