ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్
విద్యా రంగంపై రూ. 73,417 కోట్లు ఖర్చు చేశామన్న గవర్నర్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
వెలగపూడి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. ఈ నెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు బడ్జెట్ లను ప్రవేశ పెట్టిందని తన ప్రసంగంలో గవర్నర్ తెలిపారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలను చేశామని తెలిపారు. పేదల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నామని చెప్పారు. విద్యా రంగంపై రూ. 73,417 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. మనబడి నాడు – నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామని చెప్పారు. సమాజిక న్యాయం, సమానత్వం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. 8, 9 తరగతుల విద్యార్థులకు 9,52,925 ట్యాబ్ లను పంపిణీ చేశామని గవర్నర్ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నామని చెప్పారు. జగనన్న గోరుముద్దకు ఇప్పటి వరకు 4,417 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.