హైదరాబాద్ : ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి కోలుకోవడమే కాకుండా లాభాల బాటలో
పయనిస్తోందని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. ఆర్టీసీ నూతనంగా
ప్రవేశపెట్టిన 10 స్లీపర్ కమ్ సీట్లతో కూడిన నాన్ ఏసీ బస్సులను ఆయన
ఎమ్మెల్యే గాంధీతో కలిసి కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ప్రారంభించి
మాట్లాడారు. త్వరలో 550 ఎలక్ట్రికల్ బస్సులను కూడా తీసుకురానున్నామన్నారు. ఈ
నెలాఖరులో 16 ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తామన్నారు. వీటికి ‘లహరి’ అని
పేరుపెట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మొదటిసారి
అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ నాన్ఏసీ స్లీపర్ బస్సులు కాకినాడ, విజయవాడ
ప్రాంతాలకు నడుస్తాయన్నారు. ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్, కార్పొరేటర్లు
నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్
రవీందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సిబ్బందికి ఎక్స్ట్రామైల్ అవార్డులు : ప్రయాణికులను విపత్కర పరిస్థితుల్లో
ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన ఆభరణాలు, సెల్ఫోన్లు తదితర విలువైన వస్తువులు
మరిచిపోయినవారిని గుర్తించి తిరిగి అందజేసిన డ్రైవర్లు, కండక్టర్లు, డిపో
అధికారులు, సిబ్బందికి ఎక్స్ట్రామైల్ అవార్డులు అందజేశారు. ఆర్టీసీ
కళాభవన్లో.. టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ
ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. కవిత(కండక్టర్-రాణిగంజ్ డిపో),
షాఫుద్దీన్(డ్రైవర్- రాణిగంజ్ డిపో), దయానంద్ (సీనియర్ సెక్యూరిటీ
ఇన్స్పెక్టర్- జేబీఎస్ డిపో), పి.వెంకటేశ్వర్లు(డ్రైవర్-దేవరకొండ డిపో),
నరసింహారావు, కేఆర్ఏ రెడ్డి(కండక్టర్లు- బండ్లగూడ డిపో), ఎండీ గఫార్
(మెకానిక్- గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో), ఎంటీ అహ్మద్ (అసిస్టెంట్ డిపో
క్లర్క్- అదిలాబాద్ డిపో), టి.కిషన్, జీడీ కుమార్ (డ్రైవర్లు- కరీంనగర్
డిపో-2), వీఎల్ నారాయణ(కండక్టర్- కరీంనగర్ డిపో-2), రవీందర్(కండక్టర్-
నాగర్కర్నూల్ డిపో)లు ఎండీ నుంచి జ్ఞాపికలు అందుకున్నారు. సంస్థ అభివృద్ధికి
సేవలందించిన మరో 120 మందికి కూడా అవార్డులిచ్చారు.