పార్టీకి విజయం అందించలేక పోయిన గురు శిష్యులు
బెంగళూరు : విధానసభ ఎన్నికల ఫలితాలు వెల్లడై నెలరోజులు దాటినా ప్రధాన విపక్షం
బీజేపీ లో ఏ స్థాయిలోనూ కదలిక కనిపించలేదు. కేంద్ర నాయకత్వం నుంచి ఒక్క ప్రకటన
కూడా వెల్లడి కాలేదంటే ఈ ఫలితాలపై వారెంతగా అసంతృప్తి చెందారో ఊహించవచ్చు. ఇదే
స్థాయి స్తబ్ధత కొనసాగితే పార్టీ కార్యవర్గం మరింత నిస్తేజంగా మారే ప్రమాదం
ఉందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర నేతల్లోనూ ఎవరూ భవిష్యత్తు
ప్రణాళిక ఏమిటో ఇంకా వెల్లడించలేదు. ఇటీవల పార్టీ రాష్ట్ర బాధ్యుడు
అరుణ్‌సింగ్ నేతృత్వంలో నిర్వహించిన అంతర్గత సమీక్ష సమావేశంలో మాత్రం
ఒక్కొక్క నేత మనసులో మాట వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ చర్చల సారం ఏమిటో
ఎవరూ బహిరంగపరచలేదు. జాతీయ, రాష్ట్ర కార్యవర్గం చేరోదారిలో పయనిస్తే రానున్న
లోక్‌సభ, స్థానిక ఎన్నికల్లో పార్టీకి మరింత చేదు అనుభవం ఎదురయ్యే ప్రమాదం
లేకపోలేదని ఆ పార్టీలో సీనియర్లు హెచ్చరిస్తున్నారు.
అందుకే.. ఓడాం : ఊహించని ఓటమికి కారణాలపై అధికారిక ప్రకటన చేయకపోయినా పార్టీ
కోర్ కమిటీలో ఓటమిపై ఓ తీర్మానం చేసేశారు. ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణ,
కాంగ్రెస్ ఉచిత గ్యారెంటీ పథకాలు, టిప్పు సుల్తాన్, హిజాబ్, రిజర్వేషన్
సవరణ, పీఎఫ్ఐ రద్దు, యడియూరప్ప- బి.ఎల్.సంతోశ్ వర్గ పోరు వంటి అంశాలతో
పార్టీ ఓటమి పాలైనట్లు ఇప్పటికే అంతర్గత సమీక్ష ద్వారా తేల్చారు. ఓటమికి ఎవరు
బాధ్యులనే అంశంపై తర్జనభర్జన కొనసాగుతోంది. ఈ బాధ్యతల తర్వాత కీలకమైన విపక్ష
నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విప్ల నియామక ప్రక్రియ నిర్వహించాలి. అందు
కోసం జాతీయ నాయకత్వం నుంచి ఆదేశాల కోసం రాష్ట్ర నేతలు ఎదురుచూస్తున్నారు.
వారిచ్చే సలహాల ఆధారంగానే పార్టీ భవిష్యత్తు ప్రణాళిక తయారు చేయాలి.
21 నుంచి చర్చలు : విధానసభ ఎన్నికల్లో ఓటమికి కారణాలు, రానున్న లోక్‌సభ
ఎన్నికల్లో గెలుపు ప్రణాళికను తయారు చేసేందుకు ఈనెల 21 నుంచి ‘కార్యకర్తల
సమావేశం’ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పది రోజుల పాటు కనీసం 50 లక్షల
ఇళ్లను బీజేపీ నేతలు కలుసుకుంటారు. జిల్లాకు కనీసం 1000 నుంచి 2,000 వరకు
కీలకమైన నేతలను ఎంపిక చేసి వారితో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు
ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఓటమి ప్రభావం నుంచి బయటపడి లోక్‌సభ ఎన్నికల కోసం
సిద్ధం కావాలని వారిని ఉత్తేజపరుస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం,
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రూపొందించిన పథకాలపై మరింతగా ప్రచారం చేయాలని
నిర్ణయించారు. ఇదే సందర్భంగా విధానసభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణాలను
స్థానిక సమీక్షల ద్వారా సేకరిస్తారు.
సహాయవాణి షురూ : కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి భాజపా
కార్యకర్తలపై నమోదవుతున్న కేసులు, వారిపై వేధింపులు నివారించే దిశగా ప్రత్యేక
సహాయవాణిని ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. 1800 3091 907 ద్వారా పార్టీ
సభ్యులకు రక్షణ కల్పించాలని నిర్ణయించారు. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని హిట్లర్
ప్రభుత్వంతో పోల్చిన రాష్ట్ర బీజేపీ త్వరలో ప్రభుత్వంపై పోరు ప్రారంభించాలని
నిర్ణయించింది.
వ్యాఖ్యలపై నిఘా : ఇప్పటికే కొందరు సీనియర్లు పార్టీ పరాభవానికి కారణాలపై
చేసిన వ్యాఖ్యలతో జాతీయ కార్యవర్గం మండిపడ్డట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో
ఉన్న సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లపై నమోదైన కేసులను విచారణ
చేపట్టాలని సూచించినా ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పార్టీ జాతీయ
ప్రధాన కార్యదర్శి సి.టి.రవి ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్
ఎంపీల్లో 13 మందికి తిరిగి టికెట్ దక్కదని, పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన
నిప్పులా ఉందని మాజీ ముఖ్యమంత్రి డి.వి.సదానందగౌడ వ్యాఖ్యానించటంపై అధిష్ఠానం
గుర్రుగా ఉందని సమాచారం. కేవలం విధానసభ ఎన్నికల ఓటమితో పార్టీ అన్నింటా
వైఫల్యం చెందినట్లు భావించటం తగదని అధిష్ఠానం హెచ్చరించింది.