విజయవాడ సెంట్రల్ : నాగవంశీయుల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటును అందిస్తున్నట్లు
ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా నాగ వంశీయుల సంక్షేమ సంఘం నూతన కమిటీ నాయకులు శుక్రవారం
ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో
మర్యాదపూర్వకంగా కలిశారు. నాగవంశీయులతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ
సందర్భంగా మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. గత తెలుగుదేశం హయాంలో నాగవంశీయులకు
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని చంద్రబాబునాయుడు పట్టించుకున్న పాపాన
పోలేదన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు
ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడంతో పాటుగా రాష్ట్రంలో 10 లక్షలకు పైబడి
ఉన్న నాగవంశీయుల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు అన్ని విధాలా అండగా
నిలుస్తున్నట్లు వివరించారు. అనంతరం సంఘం సభ్యులు మల్లాది విష్ణుని శాలువాతో
ఘనంగా సత్కరించి.. పుష్పగుచ్చం అందజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో
నాగవంశీయుల కార్పొరేషన్ డైరక్టర్ కాళ్ల ఆదినారాయణ, ఎన్టీఆర్ జిల్లా నాగ
వంశీయుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాసరావు, సెక్రటరీ తమ్మిన
గణేష్, పెద్దలు టి.సూర్యనారాయణ, కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.