నాటా మహాసభల్లో అమెరికా వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్
డల్లాస్లో జరుగుతున్న నాటా తెలుగు మహాసభలు
నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ నాటా తెలుగు మహాసభలు డల్లాస్లో ఘనంగా
జరుగుతున్నాయి. అమెరికా, టెక్సాస్లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో జూన్
30 నుంచి జులై 2 వరకు జరుగుతున్న తెలుగు మహాసభల్లో భాగంగా అమెరికా
వైస్సార్సీపీ సోషల్ మీడియా మీట్ అండ్ గ్రీట్ నిర్వహించింది. నాటా మహాసభల్లో
రెండోరోజు వేడుకల్లో ఈ సమావేశం నిర్వహించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ
ఏర్పాటుకు, పార్టీ బలోపేతానికి, రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో భారీ
మెజార్టీతో వైకాపా అభ్యర్థులు గెలుపొందటానికి ప్రవాసులు కృషి చేయాలని
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బయ్యపు మధుసుదనరెడ్డి తదితరులు కోరారు. గత ఎన్నికల
సమయంలో ప్రతి ప్రవాస కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేశారని, మరలా ఆ పాత్ర
పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు.
వైసీపీ సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవరెడ్డి పవర్ పాయింట్
ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేంద్రీయ కార్యాలయం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న
వైసీపీ శ్రేణులతో కలిసి పనిచేయడం, సోషల్ మీడియా ఛానళ్లను ప్రభావవంతంగా
వినియోగించుకోవడం, వైసీపీ ని ఆయా వేదికల ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు,
ఓటర్లకు చేరువ చేసే విధివిధానాలు, ప్రణాళికలను ఆయన సభికులతో పంచుకున్నారు.
ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి 175కు 175 సీట్లు గెలిపించాలని
పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఈ మహాసభల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
వై.ఎస్. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను
వివరిస్తూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.