వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు
విజయవాడ : గత నెలలోనే ఫుడ్(డైట్) కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించినప్పటికీ
వాస్తవాలు గ్రహించకుండా కొన్ని పత్రికలు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక కథనాలు
ప్రచురించడం సరికాదని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు
అన్నారు. సోమవారం విజయవాడ బందర్ రోడ్డులోని ఆర్ అండ్ బి బిల్డింగ్ లో
నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదవారికి కూడా నాణ్యమైన ఆధునిక
వైద్యం అందించాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంటే కొందరు రాస్తున్న
అసత్య కథనాల వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని వాస్తవాలను వివరించారు.
ఇప్పటిదాకా ఆస్పత్రుల్లో రోగులకు చెల్లించే డైట్ చార్జీలు ప్లేటుకు 40 రూపాయలు
ఉంటే వారికి మరింత నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన డైట్ ను అందించేందుకు
ప్లేట్ కు రూ.80 అందిస్తున్నామన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బంది
పడకూడదన్న ఉద్దేశంతో గత నెలలోనే గ్రీన్ ఛానల్ పద్ధతిలో ఏ నెలకానెల బిల్లులు
చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ
చేశారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో 26 డిసెంబర్, 2022నే ఫుడ్ కాంట్రాక్టర్లకు
సంబంధించిన బిల్లులు చెల్లింపు చేశామన్నారు. ప్రధానంగా సాలూరులో 12 లక్షల
బిల్లులు చెల్లించగా 1.40 లక్షలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు.
పార్వతీపురంలో 9.78 లక్షల బిల్లులు 26 డిసెంబర్, 2022న చెల్లించామని తెలిపారు.
ఈ విషయాలను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తూ ప్రజలను ఆందోళనకు
గురిచేస్తున్నారన్నారు. జననీ శిశు సురక్ష కార్యక్రమం(జెఎస్ఎస్ వై) కింద ఇచ్చిన
బిల్లులు 5 జనవరి 2023న క్లియర్ అవుతాయన్నారు. అగ్రిమెంట్ నిబంధనలకనుగుణంగా
ప్రస్తుతం ఫుడ్ కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చామన్నారు. త్వరలోనే పాత టెండర్లు
రద్దు చేసి కొత్త టెండర్లు పిలుస్తామన్నారు. డైట్ కాంట్రాక్టర్ల విషయమై
వస్తున్న కథనాలు ఉద్దేశపూర్వకంగా రాస్తున్నవిగా తాము భావిస్తున్నామన్నారు.
దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ పోస్టుల్లో 61 శాతం ఖాళీలుంటే
ఆంధ్రప్రదేశ్ లో 96% పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. ఖాళీగా ఉన్న 4%
పోస్టులను కూడా భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ మూడున్నరేళ్లలో
వైద్య రంగానికి రూ.17,600 కోట్లు ఖర్చు చేశామన్నారు. అన్ని రాష్ట్రాల్లో
వైద్యరంగంపై బడ్జెట్ లో 3.5-4 శాతం ఖర్చు చేస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం 7.3 శాతం
ఖర్చు చేస్తోందన్నారు. నీతిఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం 8 శాతం ఖర్చు చేస్తే
లక్ష్యాన్ని చేరువవుతామన్నారు. ఈ విషయంలో ప్రశంసించకపోగా విమర్శలు చేయడం
సరికాదన్నారు. మీడియా సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్
జి.నివాస్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వి.వినోద్ కుమార్ పాల్గొన్నారు.