సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
జగనన్న విద్యా కానుక కిట్ ప్రతి ఒక్క విద్యార్థికి అందించేలా ప్రత్యేక దృష్టి
కిట్ నాణ్యత విషయంలో అభ్యంతరాలుంటే తన వ్యక్తిగత నంబర్ ను సంప్రదించాలి
ఇతర రాష్ట్రాల కంటే 4 రెట్ల అదనపు ఖర్చుతో రాష్ట్ర విద్యార్థుల కోసం
ప్రత్యేకంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు
పాఠశాల విద్యకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ
సిద్ధమే
చిత్తూరు జిల్లా పలమనేరు పర్యటనలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
ప్రవీణ్ ప్రకాష్
గుంటూరు : అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం
ఉచితంగా పంపిణీ చేసే జగనన్న విద్యాకానుక కిట్ ప్రతి ఒక్క విద్యార్థికి
అందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులను ఆదేశించారు. సోమవారం చిత్తూరు జిల్లా పలమనేరు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన ఈ సందర్భంగా జగనన్న విద్యాకానుక కిట్
క్రింద పాఠశాలలకు సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలు, వర్క బుక్ లను, ఇతర మెటీరియల్
నాణ్యతను తనిఖీ చేసి స్వయంగా పరిశీలించారు. అంతేగాక స్కూల్ బ్యాగ్ జిప్ లను
తనిఖీ చేసి, బ్యాగ్ ను భుజాన వేసుకొని నిబంధనలకు అనుగుణంగా 12 కిలోల బరువు
మోయగలదా లేదా అన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలన చేసి ధృవీకరించారు. కిట్ లో
భాగంగా విద్యార్థులకు బ్యాగ్ లను అందజేసే ముందు జిల్లా, మండల విద్యాధికారులు,
ఉపాధ్యాయులు వాటిని వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాతే అందజేయాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల కంటే 4 రెట్లు ఎక్కువ ఖర్చు చేసి రాష్ట్ర విద్యార్థుల కోసం
ప్రత్యేకంగా ప్రభుత్వం ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందజేస్తుందని వివరించారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న జగనన్న విద్యాకనుక కిట్
నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు
అనుగుణంగా కిట్ రూపొందించే విషయంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని
సిబ్బందిని ఆదేశించారు. నాణ్యత దెబ్బతినకుండా తాము అన్ని జాగ్రత్తలు
తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ జగనన్న విద్యాకానుక కిట్ నాణ్యత
విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఏమైనా అభ్యంతరాలుంటే తన వ్యక్తిగత
వాట్సాప్ నంబర్ 9013133636 కు సంబంధిత ఫోటో, సందేశం పంపించాలని కోరారు. ఇటీవల
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల పర్యటనల్లో భాగంగా అక్కడి
పరిస్థితులు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన ప్రవీణ్ ప్రకాష్ ఆయా
జిల్లాల్లో జగనన్న విద్యాకానుక కిట్ సరఫరా పూర్తి చేసిన తర్వాతే ఇతర జిల్లాలకు
సరఫరా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు మరింత బాధ్యతాయుతంగా
వ్యవహరించి విద్యా సంవత్సరంలో సకాలంలో సిలబస్ పూర్తి చేయాలన్నారు. అదే విధంగా
ఇటీవల కావలి పర్యటనకు వచ్చిన ప్రవీణ్ ప్రకాష్ స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో
విద్యనభ్యసిస్తున్న 5వ తరగతి విద్యార్థి వర్క్ బుక్‌ను పరిశీలించగా సిలబస్ లో
సగం కూడా బోధించలేదని తెలిసిందన్నారు. అంతేగాక షూ సైజులపై ఫిర్యాదులు వచ్చిన
నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా గాజువాకలోని హైస్కూల్‌ను స్వయంగా సందర్శించిన ఆయన
షూస్‌ను స్వయంగా కాలికి వేసుకొని ప్రయత్నించి చూశారు. ఈ తరహా ఫిర్యాదులు
వచ్చినప్పుడు నేరుగా శాంపిల్స్ ను పరీక్షించాలని ఆయన ప్రభుత్వ ప్రతినిధులను
కోరారు.
తన పర్యటనల సందర్భంగా వందలాది మంది విద్యార్థులతో స్వయంగా సంభాషించిన ప్రవీణ్
ప్రకాష్ తరగతి గదుల్లో బోధన, పాఠశాల స్థితిగతులు, సౌకర్యాలు, విద్యార్థుల
ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా షూస్
ధరించే అలవాటును అలవర్చుకోవాలని సూచించారు. బాలికలు రోజూ ఐరన్, ఫోలిక్ మాత్రలు
వేసుకునేలా చైతన్యపరిచారు. దాదాపు 1.75 లక్షల ద్విభాషా పుస్తకాలను ఆన్ లైన్ లో
డౌన్లోడ్ చేసుకునేలా విద్యార్థులకు ఆయన సహాయం చేశారు. ప్రభుత్వ పాఠశాలల
విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు కోసం, విద్యా వ్యవస్థ పటిష్టత కోసం రాష్ట్ర
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న జగనన్న విద్యా కానుక కిట్ ను ప్రతి
ఒక్క విద్యార్థికి సకాలంలో అందజేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల
పాలిట జగనన్న విద్యాకానుక వరం అన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత
ప్రాధాన్యతనిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థుల
భవితకు జగనన్న విద్యాకానుక కిట్ మరింతగా దోహదపడుతుందనడంలో అతిశయోక్తి
లేదన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన
ఆకాంక్షించారు. పాఠశాల విద్యకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా పరిష్కారానికి
తాను ఎల్లప్పుడూ సిద్ధమే అని ప్రవీణ్ ప్రకాష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.