వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి
విజయవాడ : నానో యూరియా ప్రయోజనాలను పరిశీలిస్తే, దానిపై మరింతగా పరిశోధనలను
ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ జాతీయ
ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పలు అంశాలపై
సోషల్ మీడియాలో స్పందించారు. నానో యూరియా వాడకంతో ఎరువుల పెట్టే ఖర్చు
తగ్గడంతో పాటు, అధిక దిగుబడి వస్తోందని, కాలుష్య ప్రభావం కూడా తక్కువగా ఉందని
నిపుణులు చెబుతున్నారని చెప్పారు. పెరుగుతున్న నానో యూరియా వినియోగం కారణంగా,
వాడే ఎరువుల పరిమాణం గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. 2025 నాటికి నానో
యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 5 కోట్ల బాటిళ్ల (ఒక సీసాలో 550 మి.లీ)
నుంచి 44 కోట్ల బాటిళ్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఇది మంచి
పరిణామన్నారు. ఇలా చేయడం వల్ల ఎరువుల సబ్సిడీపై చేసే ఖర్చు తగ్గుతుందని,
తద్వారా ఆర్థిక లోటు కూడా తగ్గించడంలో సహాయపడుతుందని అభిప్రాపడ్డారు.
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ఇంటింటా అభిమానం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా
భవిష్యత్తు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో కొనసాగుతోందని
విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 55 లక్షల
కుటుంబాల ప్రజలు మిస్డ్ కాల్స్ ఇచ్చారని తెలిపారు.
సచివాలయాల రెండో విడత ఉద్యోగుల ప్రొబేషన్
రెండో విడత నోటిఫికేషన్ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన
వారికి కూడా ప్రొబేషన్ ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి
చేసిందని తెలిపారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి
గ్రామ, వార్డు సచివాలయాలు సృష్టించి ఒకే విడతలో 1.34 లక్షల ఉద్యోగాలిచ్చి
నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపారని విజయసాయి రెడ్డి చెప్పారు.