ఎకరా నీటిపారుదల లేని ప్రాంతంలో జలసిరులు
రూ.351 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో తాగునీటికి శాశ్వత పరిష్కారం
రూ.19 కోట్లతో నిర్మించిన షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్, వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ భవనాల ప్రారంభోత్సవం
ప్రజా సంక్షేమం, డోన్ అభివృద్ధి కోసం గత పాలకులు ఏనాడైనా ఆలోచించారా?
ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామంలో ప్రారంభోత్సవాల అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
నంద్యాల : నాలుగేండ్ల కాలంలోనే డోన్ నియోజకవర్గం నలభై ఏళ్ల ప్రగతి సాధించిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ప్యాపిలి మండలంలోని హుసేనాపురం గ్రామంలో రూ.19 కోట్లతో నిర్మించిన షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్, వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలను ఆయన ప్రారంభించారు. రూ.7.66కోట్లతో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రాన్ని మంత్రి బుగ్గన ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో కలిసి ఆర్థిక మంత్రి ప్రారంభించారు. అనంతరం వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ కి సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో బాలురు, బాలికలకు ప్రత్యేక వసతి గృహాలతో పాటు అత్యాధునిక పఫ్ షీట్లతో నిర్మించిన వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ కోసం రూ.11 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రారంభోత్సవాల అనంతరం శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం గీతంతో సభా కార్యక్రమం ప్రారంభించారు. భూమిపూజ చేసిన రెండేళ్ల కాలంలోనే కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. రెండు బ్యాచ్ లు ఇప్పటికే పూర్తై, నాలుగు బ్యాచ్ లు ప్రస్తుతం కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకందారుల కోసం ప్రత్యేకంగా శిక్షణ కేంద్రం ఎక్కడా లేదన్నారు. ప్యాపిలిలోని వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ లో చదివి రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన జయశ్రీ అనే విద్యార్థినిని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశంసించారు.
వ్యవసాయాధారిత అభివృద్ధికి ప్రాధాన్యత : ప్యాపిలి పూర్తిగా వర్షం మీద ఆధారపడిన మండలం కావడం వలన పాడిపరిశ్రమ, వ్యవసాయాధారిత అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పశుసంపదకు సంబంధించిన కళాశాల కట్టాలన్నది తనకు దశాబ్దం నాటి కల అన్నారు. షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఉపయోగకరమన్నారు. మూగజీవాలకు సంబంధించిన ఏ విషయాలైనా రెండు రోజుల్లో ఇక్కడ శిక్షణతో అవగాహన పెంచుకోవచ్చన్నారు.బనగానపల్లె, అనంతపురం, పులివెందుల ప్రాంతాలను సందర్శింపజేసి రైతులకు మంచి శిక్షణనిస్తున్న పశుసంవర్థక శాఖ కృషిని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మెచ్చుకున్నారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను కంబలి,కర్ర, మేకపిల్లనిచ్చి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ సన్మానించారు.
ప్రజా సంక్షేమం పై పాలకులు ఏనాడైనా ఆలోచించారా : డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా శాశ్వత అభివృద్ధితో బాటలు వేశామని ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడించారు. ప్యాపిలి వ్యాప్తంగా రూ.250 కోట్లపైన వ్యయంతో ప్రతి గ్రామంలో రహదారులు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి బేతంచెర్ల, డోన్, ప్యాపిలి మండలాలకు రూ.351 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో తాగునీరు అందించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు. జనవరి 29వ తేదీ నాటికి తొలుత బేతంచెర్ల మండలానికి తాగు నీరిస్తామని ఆయన ప్రకటించారు. డోన్ ప్రజలు కర్నూలు వరకూ వెళ్లకుండా 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని గతంలో పరిపాలకులకు ఎప్పుడైనా బుద్ధి పుట్టిందా? అని మంత్రి తనదైన శైలిలో ప్రశ్నించారు. జలదుర్గం, ప్యాపిలి పట్టణంలో మైనార్టీలకు షాదిఖానా నిర్మించాలని, బస్ స్టేషన్ లను ఆధునీకరించాలని అనిపించిందా అన్నారు. మంత్రులు, ఉపముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులుగా పని చేసిన గత పాలకులకు ఎలక్షన్ లో గెలవడం కోసం నామినేషన్లు వేసిన కంబగిరి స్వామికి గుడి కట్టాలన్నా ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు.
బుగ్గన రాజేంద్రనాథ్ ఓ మంచి విజనరీ : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓ మంచి విజనరీ అని ఎమ్మెల్సీ ఇసాక్ బాష పేర్కొన్నారు. కోవిడ్ వంటి విపత్తులో ఆర్థిక శాఖ నిర్వహించడం ఆషామాషీ కాదన్నారు. డోన్ నియోజకవర్గ ప్రజలకు నిత్యం చూసి బుగ్గన కృషి పూర్తిస్థాయిలో తెలియడంలేదని, బయటనుంచి చూసే తమలాంటి వారు అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నట్లు తెలిపారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే నాయకులకు ప్రాంతాన్ని అవపోసన పట్టి అభివృద్ధి ఎలా చేసి చూపించాలో డోన్ నియోజకవర్గం ఒక నమూనగా నిలుస్తుందని ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పేర్కొన్నారు.డోన్ నియోజకవర్గాన్ని గతంలో పాలించిన నాయకులందరూ ఏళ్ళకేళ్లు ఆపసోపాలు పడి చేసిన అభివృద్ధి నాలుగేళ్లలో మంత్రి బుగ్గన అవలీలగా చేసి చూపారన్నారు. రూ.2,500 కోట్లతో డోన్ నియోజకవర్గంలో పల్లెపల్లె అభివృద్ధి చేసిని నిస్వార్థ ప్రజాసేవకుడు ఆర్థిక మంత్రి బుగ్గన అని మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు స్పష్టం చేశారు. అందరి మేలు కోరే ఇలాంటి నాయకుడిని మూడోసారి గెలిపించుకోవాలన్నారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడే డోన్ లో టీడీపీ నుంచి బరిలోకి దిగినా లక్ష మెజారిటీతో మంత్రి బుగ్గనను గెలిపించుకుంటామని ఆయన వెల్లడించారు.షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు రాష్ట్రంలో ప్యాపిలోనే తొలిసారి అని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ వెల్లడించారు. ఇప్పటికే 5,600 మంది రైతులకు శిక్షణనిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వర్షమొస్తే నీటి చుక్క ఉండని ప్యాపిలిలో 19 చెరువులు నింపి సాగునీరు అందించిన భగీరథుడు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అని ప్యాపిలి వ్యవసాయ సలహా మండలి సలహాదారు మెట్టు వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ప్యాపిలి మండలం హుసేనాపురంలో మంజూరైన వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలో పూర్తి స్థాయి సదుపాయాలు లేని మొదటి బ్యాచ్ లో చదువుకుని ముఖ్యమంత్రి ప్రశంసలు పొందడం చాలా గర్వంగా ఉందని విద్యార్థిని జయశ్రీ పేర్కొన్నారు.