రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
పాలసముద్రం : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించే నాసిన్ భవన నిర్మాణం
పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్
పేర్కొన్నారు. గురువారం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి
పాల్గొన్నారు. నాసిన్ ప్రధాన కేంద్రం వద్ద మంత్రికి జిల్లా కలెక్టర్ పి
అరుణ్ బాబు స్వాగతం పలికారు. అనంతరం నాసిన్ భవన్ సమావేశ మందిరంలో పలు అంశాలపై
మంత్రి సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో నాసిన్ ప్రతినిధి
నారాయణస్వామి, అనుపమ పట్నాకర్, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జాయింట్
కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మంత్రి మాట్లాడుతూ సుమారు 500 ఎకరాలు విస్తీర్ణంతో కేంద్ర ప్రభుత్వం
ఆధ్వర్యంలో నాసిన్ భవన నిర్మాణం పనులు వేగవంతంగా జరగాలని అందుకు రాష్ట్ర
ప్రభుత్వం సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఆగస్టు నెలలోపు భవన
నిర్మాణం పనులు పూర్తిచేసి జాతికి అంకితం చేయాలని తెలిపారు. అందుకు అధికారులు
ప్రత్యేక శ్రద్ధ వహించి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని తెలిపారు, మౌలిక
వసతులపై చర్చించారు, తాగునీటి పైపులు నిర్మాణం పనులు వేగవంతం చేయాలి, పది
ఎకరాలలో కేంద్ర విద్యాలయం భవన నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయి, మలగూరు
పాలసముద్రం మధ్య రైల్వే లైన్ 17.50 కిలోమీటర్ల ఉన్న పనులు చురుకుగా చేపట్టాలి
నాసిన్ క్యాంపస్ అంతా నిరంతరం విద్యుత్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు
చేపట్టాలని, గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పాలసముద్రం చెరువు కునిరంతరం నీరు
ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.నాసిన్ కేంద్రం పరిసర ప్రాంతాలలో
పచ్చదనంతో ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ, సామాజిక అటవీ వన విభాగం
ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. రిసెప్షన్ బ్లాక్,
ఎఫ్ఎసి, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ఆఫీసర్స్ కాలనీ, హాస్టల్ బ్లాకు, రోడ్లు
పనితీరు గురించి సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమంలోనాసిన్ అధికారులు క్రాంతి కుమార్ రెడ్డి, రవీంద్ర గుప్తా,
ఆర్డీవో భాగ్యరేఖ, ఇతర శాఖల అధికారులు, తాసిల్దారు తదితరులు పాల్గొన్నారు.