రైతులు బాగుండాలనే పెట్టుబడి సాయం
ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 31 వేల కోట్లు జమ చేశాం
ప్రతీ ఏడాది రూ. 3,923 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తున్నాం
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో టీడీపీ మేనిఫెస్టో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
కర్నూలు జిల్లా పత్తికొండలో ‘వైఎస్ఆర్ రైతుభరోసా’ నిధులను బటన్ నొక్కి
విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
కర్నూలు : తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలే నా నమ్మకం అని, రైతు
బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, దీన్ని తాను గట్టిగా నమ్ముతున్నట్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల
మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో ‘వైఎస్ఆర్ రైతుభరోసా’ నిధులను సీఎం బటన్ నొక్కి
విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 52.31 లక్షల మంది రైతుల
ఖాతాల్లో మొదటి విడతగా రూ.3,923.21 కోట్లను జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వరుసగా ఐదో ఏడాది ‘రైతు భరోసా’ తొలి విడత
నిధులు విడుదల చేస్తున్నామన్నారు. పెట్టుబడి రాయితీ విషయంలో విప్లవాత్మక
మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. వ్యవసాయ రంగంలో రైతులకు అన్నివిధాలా అండగా
ఉంటున్నామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా ఏ సీజన్
ఇన్పుట్ సబ్సిడీని ఆ సీజన్లోనే చెల్లిస్తున్నామన్నారు. రైతన్నకు మంచి
జరగాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని
నెరవేర్చుకుంటూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు.
గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ రైతు
భరోసా-పీఎం కిసాన్ పథకం నిధుల జమ కార్యక్రమ బహిరంగ సభలోపాల్గొని ప్రసంగించారు.
మీ ప్రేమానురాగాలకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నా. ప్రతీ ఒక్కరికీ
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ అభివాదం చేసి మరీ తన ప్రసంగం
ప్రారంభించారాయన. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన
ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఇవాళ ఆ రైతన్నల కోసం భరోసా ఇస్తూ బటన్ నొక్కి
నేరుగా రైతుల ఖాతాలోనే సాయం జమ చేస్తున్నాం. రైతులు ఇబ్బంది పడకూడదనే ఈ
పెట్టుబడి సాయం అని అన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం.
ఐదో ఏడాది తొలి విడత నిధుల్ని ఇప్పుడు విడుదల చేస్తున్నాం. 52,30,939 మంది
రైతన్నల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వం రైతుల్ని మోసం
చేసింది. కానీ, మేం మొదటి నుంచి రైతులకు అండగా ఉంటూ వస్తున్నాం. ప్రతీ
రైతన్నకు రూ.61,500 సాయం అందించాం. గత నాలుగేళ్లుగా 22.70 లక్షల మంది రైతన్నల
కుటుంబాలకు రూ.1,965 కోట్లు నేరుగా వాళ్ల ఖాతాల్లో జమ చేశాం. మేనిఫెస్టోలో
ప్రకటించిన దానికంటే ఎక్కువగా రూ.12,500కి బదులు రూ. 13,500 రైతు భరోసా
అందిస్తున్నామన్నారు.
ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 31 వేల కోట్లు జమ చేశాం. ప్రతీ ఏడాది రూ. 3,923
కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తున్నాం. ఏ సీజన్లో అయిన పంట నష్ట జరిగితే
అదే సీజన్లో నష్ట పరిహారం అందిస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ చరిత్రలోనే
విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. విత్తనం నుంచి పంట కొనుగోలుదాకా రైతన్నలకు
అండగా ఉన్నాం. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. మీ ఈ
బిడ్డ పరిపాలన మొదలయ్యాక మంచి వానలు ఉన్నాయి. కరువుల్లేవ్.. వలసలు కూడా
తగ్గిపోయాయి. ఈ నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఆర్బీకేల ద్వారా మీ బిడ్డ హయాంలోనే రైతులకు మేలు జరుగుతోంది. మీ బిడ్డ పాలనలో
3.09 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాం. ఈ నాలుగేళ్లలో ధాన్య సేకరణపై రూ.60 వేల
కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ వ్యయం రూ. 77 వేల కోట్లకు
చేరుతుందని చెప్పారు.&
గతంలో గ్రామస్థాయిలో భూ వివాదాలు ఉండేవి. రైతన్నలకు భూమిపై సర్వహక్కులు ఎంతో
ముఖ్యం. అందుకే కీలక అడుగు వేశాం. సుమారు వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే
జరుగుతోంది. సమగ్ర భూసర్వేతో భూవివాదాలను పరిష్కరిస్తున్నామన్నారు. చుక్కల
భూములపై సర్వ హక్కులూ రైతులకే ఇచ్చిన ప్రభుత్వం మనది. అక్వా రైతులకు మేలు
చేసిన ప్రభుత్వం మనదే. అక్వా రైతులకు రూ. 2,967 కోట్లు సబ్సిడీ అందించాం.
రైతులకు పగటి పూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.1,700 కోట్ల తో
ఫీడర్లను బలపరుస్తున్నాం. రూ. 1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తున్న ఏకైక
రాష్ట్రం ఏపీ. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులను మీ గ్రామానికే తీసుకొచ్చే
అడుగుపడుతోందని సీఎం జగన్ ప్రకటించారాయన. సున్నా వడ్డీతో 74 లక్షల మందికి
మేలు చేయగలిగాం. గత నాలుగేళ్లలో రూ.1,1835 కోట్లను సున్నా వడ్డీ కింద రైతులకు
ఇచ్చాం. 44 లక్షల మంది రైతులకు రూ.6,685 కోట్లు పంటబీమా ఇచ్చాం. మహానేత
వైఎస్సార్ జయంతి రోజున ఇన్స్యూరెన్స్ కూడా జమ చేస్తామని సీఎం జగన్
ప్రకటించారు. రైతుల మొత్తం బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోందని సీఎం
జగన్ పేర్కొన్నారు.
టీడీపీ మేనిఫెస్టోపై విమర్శలు ఎం: మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత
చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై జగన్ విమర్శలు గుప్పించారు. ఆ మేనిఫెస్టో
కర్ణాటకలో పుట్టిందని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లోబీజేపీ కాంగ్రెస్
పార్టీలు ఇచ్చిన హామీలతో పాటు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో
టీడీపీ మేనిఫెస్టో ప్రకటించారన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను
నెరవేర్చకుండా రైతులు, ప్రజలను చంద్రబాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు.