హైదరాబాద్ : ప్రగతి చక్రం ఇకపై మరింత వేగంగా పరుగులు పెట్టనున్నది. 9
దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీలో ప్రభుత్వం సరికొత్త జోష్ నింపింది. నిజాం
కాలంలో 1932లో ఆర్టీసీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పట్లో ‘నిజాం రాష్ట్ర
రైల్వే-రోడ్డు రవాణా శాఖ’ అని పిలిచేవారు. 27 బస్సులు, 166 మంది సిబ్బంది
ఉండేవారు. స్వాతంత్య్రం అనంతరం 1951 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రంలో
విలీనమైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 1958 జనవరి 11న
ఏపీఎస్ఆర్టీసీగా అవతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో 22,628 బస్సులతో ప్రపంచంలోనే
అతిపెద్ద ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థగా రికార్డులకెక్కింది. 1999లో గిన్నిస్
రికార్డు సాధించింది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం.. 2015 జూన్ 3న తెలంగాణ
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా (టీఎస్ఆర్టీసీ) రూపాంతరం చెందింది. అప్పటికి
సంస్థకు 98 డిపోలు ఉన్నాయి. టీఎస్ ఆర్టీసీకి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం
2016 ఏప్రిల్ 27న ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఏపీతోపాటు
మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌కు సర్వీసులు నడుస్తున్నాయి.
రోజుకు సుమారు 90 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆర్టీసీలో 9,384 బస్సులు ఉన్నాయి. ఇందులో 68 శాతం.. అంటే సుమారు
6,300 బస్సులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 364 బస్స్టేషన్లు ఉన్నాయి.
ఒడిదొడుకుల ప్రయాణం : వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాలు పెద్దగా లేని
సమయంలో ఆర్టీసీ గొప్పగా విరాజిల్లింది. ‘ఎర్రబస్సు’కు ప్రజాదరణ గొప్పగా
ఉండేది. ఉమ్మడి రాష్ట్ర హయాంలో ఆర్టీసీ నష్టాలు చవిచూసింది. నాటి ప్రభుత్వా
నిర్లక్ష్యంతో అప్పుల్లో కూరుకుపోయింది. జీతాలకు కూడాఅప్పులు తేవాల్సిన
పరిస్థితి తలెత్తింది. సంస్థకున్న వేలకోట్ల ఆస్తులను తనఖా పెట్టాల్సిన
దుస్థితికి చేరుకుంది.
మొదటి నుంచీ అండ : స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ తొలి నుంచీ
ఆర్టీసీకి అండగా నిలుస్తున్నారు. ప్రజా జీవితంలో భాగమైన ఆర్టీసీకి ఏటా
బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారు
చేసిన సేవలకు గుర్తింపుగా మొదట 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. నిర్వహణకు
డబ్బుల కోసం ప్రభుత్వం గ్యారంటీగా ఉంటూ అనేక రుణాలు ఇప్పించింది. అయినా
నష్టాలు, కష్టాల బాటలోనే ప్రయాణించడంతో తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం
కేసీఆర్‌కు కార్మికులు విజ్ఞప్తి చేశారు. తాజాగా ప్రభుత్వం వారికి శుభవార్త
చెబుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించింది.