నయా రాయ్‌పుర్ : అదానీ వ్యవహారంపై నిజాలు బహిర్గతం అయ్యే వరకూ కేంద్రాన్ని
ప్రశ్నిస్తూనే ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్లీనరీ ముగింపు సభలో మాట్లాడిన రాహుల్.. భారత్ జోడో యాత్ర
ఇచ్చిన స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామన్నారు. అదానీ
గ్రూపుపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ ) కొంత
కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర
ప్రభుత్వం అదానీకి మద్దతుగా నిలవడం పట్ల కాంగ్రెస్ మరోసారి తీవ్రంగా
మండిపడింది. వాస్తవాలు బయటకు వచ్చే వరకూ అదానీ గురించి ప్రభుత్వంపై ప్రశ్నలు
వేస్తూనే ఉంటామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నయా రాయ్‌పుర్‌లో జరిగిన
కాంగ్రెస్ ప్లీనరీ ముగింపు సభలో మాట్లాడిన ఆయన భారత జోడో యాత్ర ఇచ్చిన
స్ఫూర్తితో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ‘అదానీ
గురించి పార్లమెంటులో విమర్శలు చేశాను. ప్రధాని నరేంద్ర మోడీతో ఆయనకున్న
సంబంధాన్ని ప్రశ్నించాను. కానీ ప్రభుత్వం, మంత్రులు మాత్రం ఆ వ్యాపారవేత్తనే
వెనకేసుకొచ్చాయి. మా ప్రసంగాలను కూడా రికార్డుల నుంచి తొలగించారు. అదానీ
గురించి పార్లమెంటులో ఎవ్వరూ ప్రశ్నించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. నిజాలు
బహిరంగం అయ్యేవరకూ వెయ్యి సార్లు అయినా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆపే ప్రసక్తే
లేదు’ అని కాంగ్రెస్ 85వ ప్లీనరీలో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
అదానీ దేశాన్ని ఎంతో గాయపరుస్తున్నారని, దేశంలో మౌలిక సదుపాయాలన్నింటినీ
లాక్కోవాలని అదానీ గ్రూపు చూస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పోర్టులు సహా
ఎన్నో విధాలుగా దేశ సంపదను లాక్కుంటోన్న ఒకే ఒక్క కంపెనీ మీదనే తమ
పోరాటమన్నారు. ఇక భారత విదేశాంగశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ
ప్రస్తావించారు. చైనా ఆర్థికవ్యవస్థ మనకంటే పెద్దది.. వారితో ఎలా పోరాడగలమని
కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం జాతీయవాదం కాదని, పిరికితనమని విమర్శించారు.
జోడో యాత్ర పేరుతో నాలుగు నెలలపాటు తపస్సు చేశామని, పార్టీ శ్రేణులను అది
ఎంతగానో ఉత్తేజపరిచిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అటువంటి తపస్సును ఆపమని
స్పష్టం చేశారు. ఎండ, వాన, చలి లెక్కచేయకుండా భారత్ జోడో యాత్రలో లక్షల మంది
తనతో కలిసి నడిచారని అన్నారు. జోడో యాత్రకు ఊహించని మద్దతు లభించిందని,
పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టాలను చూశానన్నారు. నాలుగు నెలలకుపైగా ఇంటికి
దూరంగా ఉండటంపై తన కుటుంబం ఎంతో కఠిన సమయాన్ని ఎదుర్కొందని అని రాహుల్ గాంధీ
గుర్తుచేసుకున్నారు.