శ్రీశైలం : శ్రీశైలంలో శ్రీశైల క్షేత్ర భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల నగరాల కులస్థుల నిత్య అన్నదాన వసతి సత్రం నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఉదయం వైభవంగా జరిగిందని నగరాల కులస్థుల నిత్య అన్నదాన వసతి సత్రం కమిటీ ప్రధాన కార్యదర్శి కె యస్ జగన్, అధ్యక్షులు నల్లాన సూర్యా రావు, కార్యవర్గ సభ్యులు లింగిపల్లి రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎస్.లవన్న మాట్లాడుతూ ఈ అన్న సత్ర నిర్మాణం చాలా సంతోషకరమని అన్నారని వారు తెలిపారు. అన్న సత్రం నిర్మాణ సమయంలో అవసరమైన అనుమతులు, సహాయ సహకారాలను అందజేస్తానని లవన్న హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్న సత్రం నిర్మాణానికి భూరి విరాళాన్ని ఇచ్చిన ఇల్లిపిల్లి రంగనాయకమ్మ , కొరగంజి జగన్నాథరావు పాత్రుడు హిమ బాల దంపతులను నిర్మాణ కమిటీ వారు ఘనంగా సత్కరించారు. నగరాల కులస్థుల చిరకాల స్వప్నం, దక్షిణ కాశీగా పిలవబడే శ్రీశైల క్షేత్రం నందు అన్నదాన వసతి సత్రం నిర్మాణం కోసం స్థలం కేటాయించేందుకు కృషి చేసిన మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస రావు కు కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీశైలం లో 50 సెంట్ల స్థలం లో ఈ సత్రం నిర్మాణం జరుగుతోందని, ఒక సంవత్సరం లోపే నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ వారు నిర్ణయించారు.