పరిగణనలోకి తీసుకున్న డేనియల్ గ్రీన్బర్గ్
లండన్ : బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన అంశంలో ఆరోపణలు
ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌పై పార్లమెంటరీ వాచ్డాగ్
విచారణ ముగిసింది. నిబంధనల విషయంలో తాను కొంత గందరగోళానికి గురైనట్లు సునాక్
తెలిపారు. పార్లమెంట్ కమిషనర్ ఫర్ స్టాండర్డ్స్ డేనియల్ గ్రీన్బర్గ్
దీనిని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే నిబంధనలను ఉల్లంఘించినందుకు
ప్రధాని క్షమాపణలు తెలిపారు. మార్చి ఆరంభంలో యూకే ప్రభుత్వం స్ప్రింగ్
బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందులో చిన్నారుల సంరక్షణకు ఆయాల సేవలను అందించే
కంపెనీలకు ప్రోత్సాహకాలు కల్పించేలా నూతన పైలట్ పథకాన్ని ప్రకటించారు. కాగా..
ఇలాంటి సేవలనే అందించే ‘కోరు కిడ్స్ లిమిటెడ్’ అని కంపెనీలో రిషి సతీమణి
అక్షతా మూర్తి వాటాదారుగా ఉన్నారు. అయితే, ఈ విషయాన్ని సునాక్ ప్రకటించలేదు.
దీంతో భార్య వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రధాని ఈ పైలట్ ప్రాజెక్టును
ప్రవేశపెట్టారంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ
అంశంపై పార్లమెంట్ స్టాండర్డ్స్ కమిషనర్ ఏప్రిల్‌లో దర్యాప్తు చేపట్టారు.
రిజిస్ట్రేషన్, డిక్లరేషన్ నిబంధనల భాషను అర్థం చేసుకోవడంలో కాస్త
గందరగోళానికి గురయ్యానని సునాక్ తెలుపుతూ అందుకుగానూ కమిషనర్‌కు క్షమాపణలు
చెప్పారు. ‘‘చట్ట సభ్యులు పాలసీపై ప్రశ్నించినప్పుడు ప్రధాని దీనిలో ఉన్న
వాటాల గురించి తెలపాల్సి ఉంది. కానీ, ఆయన అలా చేయలేదు. ప్రకటన సమయంలో
నిబంధనలను పాటించడంలో ప్రధాని కాస్త గందరగోళానికి గురయ్యారు. ఆయన వివరణతో మేం
సంతృప్తి చెందాం’’ అని గ్రీన్బర్గ్ పేర్కొన్నారు. చట్టసభల్లో నిబంధనలను
ఉల్లంఘించిన సభ్యులను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసే అధికారం ఆయనకు ఉంది.