ఒంగోలు : తాను జిఓ నెంబర్ 1 ని ఉల్లంఘించి రోడ్డు షో నిర్వహించినట్లు వచ్చిన
కధనాలు అవాస్తవమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్
ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన లో తెలిపారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం
వెల్లంపల్లి గ్రామంలో తాను రోడ్డు షో నిర్వహించడం వల్ల ట్రాఫిక్
స్తంభించినట్టు కధనాలు రాయటాన్ని ఆయన తప్పు పట్టారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు
కేంద్రం ప్రారంభించేందుకు వెళితే గడప గడప కార్యక్రమం నిర్వహించానని ఒక పత్రిక
లో రాసారన్నారు. నిజం తెలుసుకోకుండా వార్తలు రాయటం సరికాదన్నారు. హై వే
దగ్గరలో గుడి ఉండటంతో కొబ్బరికాయ కొట్టెందుకు కారు దిగానని అక్కడకు
కార్యకర్తలు రావటం జరిగిందన్నారు. దానిని రోడ్డు షో అంటే ఎలా అన్నారు. ఒక్క
నిముషం కూడా ట్రాఫిక్ ఆగలేదని స్తంభించినట్టు ఎవరైనా నిరూపిస్తారా అని సవాల్
విసిరారు. జీ ఓ లను, చట్టాలను ఉల్లంఘించటం టీడీపీ నాయకులకు అలవాటని, తమకు
చట్టం పై గౌరవం ఉందన్నారు. చంద్రబాబు కు ఎలా మేలు చేయాలా అని కొన్ని పత్రికలు
ఛానెల్స్ తమపై తప్పుడు కధనాలు రాయటం జరుగుతుందని అన్నారు. అసత్యాలు పదే పదే
ప్రచారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.