వేగంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
టీఎస్పీఎస్సీని మరింత పటిష్ఠం చేస్తాం
టీఎస్పీఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎం.మహేందర్రెడ్డి
హైదరాబాద్: నిబంధనలకు లోబడి ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకు కమిషన్ అధికారులు, సభ్యులు అందరూ కలిసి కృషి చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కొత్తబోర్డు కార్యకలాపాలు మొదలయ్యాయి. కొత్త ఛైర్మన్, సభ్యుల నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే వారి ప్రమాణ స్వీకారం కోసం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎం.మహేందర్రెడ్డి ఛైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా నియమితులైన అయిదుగురు సభ్యుల్లో అనితారాజేంద్ర, రజినీకుమారి, యాదయ్యలతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఇద్దరు సభ్యులు రామ మోహన్ రావు, అమీరుల్లాఖాన్లు తరువాత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఛైర్మన్ కమిషన్ ఉద్యోగులు, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ద్వారా టీఎస్పీఎస్సీ ఏర్పాటైందని, ఈ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసి, బాధ్యతాయుతంగా ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి, ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి, రాతపరీక్షలు నిర్వహించి, నిబంధనల ప్రకారం నియామకాలు పూర్తిచేద్దామని పిలుపునిచ్చారు.